India covid news: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్. యాక్టివ్ కేసుల్లో 5 నుంచి 10 శాతం మంది బాధితులకు ఆస్పత్రి చికిత్స అవసరమవుతోందని తెలిపారు. పరిస్థితి అస్థిరంగా ఉందని, ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య సైతం మారొచ్చని అప్రమత్తం చేశారు. వైద్య సిబ్బంది సేవలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు. జంబో వైద్య కేంద్రాలు, ఫీల్డ్ ఆస్పత్రులను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రశంసించారు.
Rajesh Bhushan letter to States:
Centre letter to states:
"రెండోవేవ్ సమయంలో దేశంలో ఆస్పత్రుల్లో చేరిన కరోనా బాధితుల సంఖ్య 20-23 శాతంగా ఉండేది. ప్రస్తుతం, యాక్టివ్ కేసుల్లో 5 నుంచి 10 శాతం మందికి ఆస్పత్రి చికిత్స అవసరమవుతోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సహా ఇప్పటికే వ్యాప్తిలో ఉన్న డెల్టా వల్ల కేసులు పెరుగుతున్నాయి."
-రాజేశ్ భూషణ్, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి
ఈ సందర్భంగా రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు రాజేశ్ భూషణ్. రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య, యాక్టివ్ కేసులు, ఐసోలేషన్‌లో ఉన్న బాధితులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్యను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని చెప్పారు. ఐసీయూ, ఆక్సిజన్ పడకలు, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయో లేదోనని చూసుకోవాలని పేర్కొన్నారు.
ఇంకా ఏమన్నారంటే...?
- ప్రైవేట్ కొవిడ్ కేర్ క్లినిక్‌లలో వివిధ రకాల పడకలు అందుబాటులో ఉండాలి.
- ఈ కేంద్రాలలో వసూలు చేసే రుసుం అందుబాటులోనే ఉండాలి. అధికంగా వసూలు చేసిన క్లినిక్‌లను గుర్తించి చర్యలు తీసుకోవాలి.
- వలంటీర్ల శిక్షణ, టెలీ కన్సల్టేషన్ కోసం విశ్రాంత వైద్య నిపుణులు, ఎంబీబీఎస్ విద్యార్థుల సేవలను వినియోగించుకోవచ్చు.
- కొవిడ్ రోగులను తరలించేందుకు ఇబ్బందులు కలగకుండా అదనపు అంబులెన్సులను సిద్ధం చేసుకోవాలి.
- అన్ని జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రులను ఈ-సంజీవనీ టెలీకన్సల్టేషన్ హబ్‌లుగా ఉపయోగించుకోవాలి.
రాత్రి పది గంటల వరకు టీకా!
COVID 19 vaccination timing: మరోవైపు, టీకా పంపిణీ సమయాన్ని రాత్రి 10 గంటల వరకు పొడగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. టీకా కోసం ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వైద్య శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ అజ్ఞాని తెలిపారు.
"ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకే టీకా కేంద్రాలు పనిచేస్తున్నాయని సాధారణ భావన ఉండిపోయింది. ఇది సరికాదు. డిమాండ్‌ను బట్టి రాత్రి 10 గంటల వరకు టీకా పంపిణీ చేపట్టవచ్చు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న మానవ వనరులు, మౌలిక సదుపాయాలను బట్టి ఈ నిర్ణయం తీసుకోవాలి. టీకా కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులు కరోనా నిబంధనలు పాటించాలి."
-డాక్టర్ మనోహర్ అజ్ఞాని, కేంద్ర వైద్య శాఖ అదనపు కార్యదర్శి
దిల్లీలో ఆంక్షలు.. లాక్‌డౌన్‌కు నో..!
Delhi lockdown news: మరోవైపు, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం ఆంక్షలను కట్టుదిట్టం చేస్తోంది. రెస్టారెంట్లు, బార్లను మూసివేయాలని నిర్ణయించింది. పార్శిల్ విక్రయాలను(టేక్-అవే) మాత్రమే అనుమతించనున్నట్లు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తెలిపారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో మండలంలో... రోజుకు ఒక వీక్లీ మార్కెట్ మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు బైజాల్ వెల్లడించారు. ఆసుపత్రుల్లో అదనపు సిబ్బంది కోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 15-18 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించాలని ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
ఆఫీసుల్లో 50 శాతం లిమిట్!
UP covid restrictions: అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ 50 శాతం సామర్థ్యంతోనే పనిచేయాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు ఉద్యోగులకు కరోనా సోకితే.. ఏడు రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. అన్ని కార్యాలయాల్లో కొవిడ్ సహాయక డెస్కులను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఆస్పత్రులు టెలీకన్సల్టేషన్ను ప్రోత్సహించాలని సూచించారు. ఎన్నికలు జరిగే జిల్లాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కొంతమంది అతిథులతోనే వివాహాలు..
Kerala covid news: కేరళలో వివాహ వేడుకలకు హాజరయ్యే అతిథుల సంఖ్యను మరింత కుదించారు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్. వివాహాలు, అంత్యక్రియలకు 50 మందికి మించి హాజరు కావొద్దని స్పష్టం చేశారు. కొవిడ్‌పై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమాల్లో కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
ఇదివరకు, బహిరంగ కార్యక్రమాలకు 150 మంది, మూసిన గదుల్లో జరిగే కార్యక్రమాలకు 75 మందికి మించకుండా హాజరు కావొచ్చని నిబంధన విధించింది కేరళ ప్రభుత్వం. తాజాగా దీన్ని మరింత తగ్గించింది. అత్యవసర పరిస్థితుల్లో మినహా ఇతర కార్యక్రమాలన్నీ ఆన్లైన్ వేదికగా నిర్వహించుకోవాలని సీఎం సూచించారు.
కరోనాకు లోబడే జల్లికట్టు!
Jallikattu restrictions Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టు కార్యక్రమాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. 150 మంది లేదా సీట్ల సామర్థ్యంలో 50 శాతం మందికే అనుమతి ఉంటుందని తెలిపింది. ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇది 48 గంటల లోపుదై ఉండాలని పేర్కొంది.
స్కూళ్లు బంద్
హరియాణాలో అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రకటించారు. జనవరి 26 వరకు విద్యాసంస్థలు మూసి ఉంటాయని తెలిపారు. ఆన్లైన్ తరగతులు కొనసాగుతాయన్నారు.
ఇదీ చదవండి:'ఈ నెలాఖరులో పీక్ స్టేజ్‌కు కరోనా థర్డ్ వేవ్.. మార్చి వరకు...'