దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. 149 రోజుల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కరోనా వ్యాప్తిపై రోజువారీ గణాంకాలు విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం 24 గంటల వ్యవధిలో ఏకంగా 1890 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం 149 రోజుల తర్వాత ఇదే ప్రథమం. గతేడాది అక్టోబర్ 28న 2,208 కేసులు వెలుగులోకి వచ్చాయి.
- కొత్త కేసులు పెరిగిన నేపథ్యంలో యాక్టివ్ కేసుల సంఖ్య సైతం అధికమైంది. ప్రస్తుతం 9,433 మంది కరోనాతో బాధపడుతున్నారు.
- శనివారం కరోనాతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కొవిడ్‌తో చనిపోయిన వారి సంఖ్య 5,30,831కు పెరిగింది.
- కొత్త మరణాల్లో మహారాష్ట్ర, గుజరాత్‌లలో రెండు చొప్పున వెలుగులోకి వచ్చాయి. కేరళలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది.
- మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
- రోజువారీ పాజిటివిటీ రేటు 1.56 శాతంగా నమోదైంది. వీక్లీ పాజిటివిటీ రేటు 1.29 శాతంగా ఉంది.
- ఇక దేశంలో ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్లు దాటింది.
- మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య స్వల్పంగానే ఉంది. 0.02 శాతం యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా రికవరీ రేటు 98.79 శాతం ఉన్నట్లు స్పష్టం చేసింది.
- కొవిడ్ నుంచి విజయవంతంగా కోలుకున్నవారి సంఖ్య 4,41,63,883కు చేరుకుంది.
- కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెబ్సైట్ ప్రకారం.. దేశవ్యాప్త కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 220.65 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేశారు.