భారత్‌లో కొవిడ్-19 విజృంభణ.. మే ప్రథమార్ధంలో గరిష్ఠ స్థాయికి చేరుతుందని మిషిగన్ విశ్వవిద్యాలయంలో అంటు వ్యాధుల విభాగం ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ పేర్కొన్నారు. అప్పటికల్లా ప్రభుత్వపరంగా వెల్లడించే రోజువారీ కేసుల సంఖ్య 10 లక్షలకు, మరణాలు 5వేలకు చేరే అవకాశం ఉందని 'ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్' (ఐహెచ్‌ఎంఈ) నమూనా సాయంతో ఆమె విశ్లేషించారు. ఆగస్టు నాటికి ఉద్ధృతి తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు.
"వెలుగులోకి రాని కేసులతో కలిపి మొత్తం ఇన్‌ఫెక్షన్లు మే మధ్యనాటికి గరిష్ఠ స్థాయిలో 45 లక్షలకు చేరొచ్చు. పరిస్థితులు దిగజారితే అది 50 లక్షలకూ చేరే ప్రమాదం ఉంది. భారత్‌లో ప్రస్తుతం రోజుకు 3 లక్షల కేసులు మాత్రమే వెల్లడిస్తున్నా పరిస్థితులు అంతకంటే దారుణంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ కఠినమైన లాక్‌డౌన్‌లు విధించడం, మాస్క్‌లు తప్పనిసరిగా ఉపయోగించడం, భారీ సమూహాలను నిషేధించడం, అంతర్రాష్ట్ర రాకపోకలను నియంత్రించడం, వ్యాక్సినేషన్ పెంచడం ద్వారా గణాంకాలను తగ్గించవచ్చు.''
- భ్రమర్ ముఖర్జీ, మిషిగన్ విశ్వవిద్యాలయం