తెలంగాణ

telangana

'వీధి రౌడీల స్థాయికి చైనా ఆర్మీ.. డ్రాగన్ దూసుకొస్తే.. సైన్యం చేతులు ముడుచుకొని కూర్చోదు'

By

Published : Dec 16, 2022, 1:48 PM IST

India China Border Dispute : సరిహద్దుల్లో ముళ్ల తీగలు, మేకులు కొట్టిన కర్రలతో దాడులకు దిగుతూ వీధి రౌడీల స్థాయికి చైనా ఆర్మీ దిగజారిందని భారత ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం నరవణె విమర్శించారు. ప్రతి ఏడాది చొరబాట్లకు యత్నిస్తున్న చైనా సైనికులు.. భారత జవాన్ల చేతిలో చావుదెబ్బలు తిని వెళ్తున్నారని అన్నారు. గల్వాన్‌ ఘర్షణ చైనా ఖ్యాతిని అంతర్జాతీయంగా దారుణంగా దెబ్బతీసిందని.. ఆ సమయంలో ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా ఉన్న నరవణె వెల్లడించారు.

india china conflict
భారత్ చైనా వివాదం

India China Border Dispute : అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా-భారత్‌ బలగాల మధ్య ఘర్షణ.. డ్రాగన్‌ బలగాల కవ్వింపులకు మరో నిదర్శనమని ఇండియన్‌ ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం నరవణె అన్నారు. ముళ్ల తీగలు, మేకులు కొట్టిన కర్రలతో దాడులకు దిగుతూ చైనా ఆర్మీ.. వీధి రౌడీల స్థాయికి దిగజారిందని ఎద్దేవా చేశారు. డ్రాగన్‌కు విస్తరణ కాంక్ష బాగా పెరిగిపోయిందన్న జనరల్‌ నరవణె.. ఇండియన్‌ ఆర్మీ దానికి దీటుగా సమాధానం చెప్తోందన్నారు. వేలాది మంది సైన్యంతో చైనా దూసుకువస్తే కాల్పులు జరపకుండా చేతులు మూసుకుని కూర్చోలేమన్నారు. 1993 ఒప్పందాన్ని తరచూ ఉల్లంఘిస్తున్న చైనా మాటలు చెప్తూ కూర్చుంటే భారత సైనికులు వినుకుంటూ కూర్చోరని వెల్లడించారు.

మీరు( చైనా ఆర్మీ‌) నిబంధనలు అన్నీ ఉల్లంఘిస్తూ.. కాల్పులకు పాల్పడుతున్నారని మమ్మల్ని నిందించలేరు. మీరు 5 వేల మంది సైన్యంతో మా మీదకు దూసుకొస్తే మేం చేతులు ముడుచుకుని కూర్చోలేం. తప్పకుండా మేము కాల్పులు జరుపుతాం. చైనా సైన్యం తరచుగా ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. మీరు(చైనా) నిబంధనలను తరుచుగా ఉల్లంఘిస్తే మేము నిశ్శబ్ధంగా కూర్చోలేం కదా. నేను ఓ విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. భారత సైన్యం వద్ద ఎప్పుడూ ఆయుధాలు ఉంటాయి. ఆర్మీ పెట్రోలింగ్‌కు వెళ్లేటప్పుడు ఎలాంటి ఆపదైనా వస్తుందని భావించి తప్పకుండా ఆయుధాలను తీసుకొనే వెళ్తారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రైఫిల్‌, లైట్‌ మెషిన్‌గన్‌, మందుగుండు తీసుకునే సైన్యం పెట్రోలింగ్‌కు వెళ్తుంది.

--జనరల్‌ ఎం.ఎం. నరవణె, భారత ఆర్మీ మాజీ చీఫ్‌

గల్వాన్‌ ఘర్షణలో చైనాను చావు దెబ్బకొట్టిన భారత బలగాలు.. డ్రాగన్‌కు పొరుగున ఉన్న దేశాలకు మనో ధైర్యాన్ని ఇచ్చాయని జనరల్‌ నరవణె అన్నారు. గల్వాన్ ఘర్షణ ప్రపంచం దృష్టిలో చైనా స్థాయిని తగ్గించిందన్న ఆయన.. దీనివల్ల చాలా పొరుగు దేశాలు డ్రాగన్‌ను ఎదిరించవచ్చన్న నిర్ణయానికి వచ్చాయన్నారు. చైనా బలగాలు తమను ఏ విధంగా లక్ష్యంగా చేసుకున్నాయో భారత సైనికులు అదే రీతిలో డ్రాగన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తారని జనరల్‌ నరవణె స్పష్టం చేశారు.

గుండాల మాదిరిగా చైనా సైన్యం ప్రవర్తిస్తోంది. ఆ స్థాయికి చైనా సైన్యం దిగజారింది. రౌడీయుజం చేస్తోంది. వీధి పోరాటాలు చేస్తోంది. ఓ పక్క సాంకేతిక నైపుణ్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తూ.. మరోవైపు ముళ్ల కర్రలతో దాడులకు వస్తున్నారు. ఇది హాస్యాస్పదం. చైనా సైన్యం దుందుడుకు చర్యలు ప్రతీ సంవత్సరం ఉంటాయి. ప్రతీ ఏడాది రెండుమూడు సార్లు డ్రాగన్‌ ఆర్మీ భారత్‌ భూభాగంవైపు వస్తోంది. ప్రతిసారి వాళ్లను సమర్థంగా అడ్డుకుంటాం. చైనా సైనికులపైన వాళ్ల ఉన్నతాధికారుల ఒత్తిడి ఉంటుంది. ఓడిపోయి రాకండి ఇంకేమైనా చేయండి అని వాళ్లు రెచ్చగొట్టడం వల్లే సైనికులు దుందుడుకు చర్యలకు పాల్పడుతారు. వాళ్లు ఏ చర్యలకు పాల్పడినా ఇప్పటివరకూ వారిని సమర్థంగా తరిమికొట్టాం. ప్రతీ ఏడాది చైనా ఆర్మీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. ఏడాదికి ఏడాది వాళ్ల సైనికులు గాయపడుతూనే ఉన్నారు. మనవాళ్లు కూడా ఆ ఘర్షణల్లో గాయపడుతున్నారు. కానీ చైనా సైనికులే ఎక్కువగా దెబ్బలు కాస్తున్నారు.

--జనరల్‌ ఎం.ఎం. నరవణె, భారత ఆర్మీ మాజీ చీఫ్‌

మాటామాటా పెరిగి ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఇరుదేశాల సైనికులు ఘర్షణకు దిగినా ఆ తర్వాత చర్చలు జరిపి శాంతి నెలకొనేలా యత్నిస్తారన్నారు. చైనా ఆర్మీ కర్రలను తీసుకొస్తే భారత సైన్యం కూడా కర్రలను తీసుకెళ్తుందన్నారు. ప్రత్యర్థిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదన్న మాజీ ఆర్మీ చీఫ్.. అలా అంచనా వేస్తే భారీ నష్టం తప్పదని హెచ్చరించారు. భారత సైనికులకు దేశం, ప్రభుత్వం, ప్రజల మద్దతు ఉందన్నారు. ఏ దేశం సవాల్‌ విసిరినా ఎదుర్కొనేందుకు భారత సాయుధ బలగాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయని నరవణె అన్నారు. ఒక దేశంగా.. సైన్యంగా తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.

ABOUT THE AUTHOR

...view details