India-Central Asia Summit: సమీకృత, స్థిరమైన పొరుగుదేశంగా ఉండాలనే భారత విజన్‌కు సెంట్రల్ ఆసియా ప్రధాన కేంద్రంగా ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్-సెంట్రల్ ఆసియా తొలి సదస్సుకు వర్చువల్‌గా నేతృత్వం వహించి పలు అంశాలపై మాట్లాడారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వం, శ్రేయస్సుకు పరస్పర సహకారం అవసరమని సూచించారు.
"మనం అఫ్గానిస్థాన్‌లోని పరిస్థితులపై ఆందోళన చెందుతున్నాం. అది భారత్, సెంట్రల్ ఆసియా మధ్య సహకారం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఇందులో ప్రాంతీయ స్థిరత్వం, భద్రత చాలా ముఖ్యం. భారత్, సెంట్రల్ ఆసియా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు 30 ఏళ్లు ఫలప్రదంగా పూర్తిచేసుకున్నాయి. సెంట్రల్ ఆసియా దేశాలతో భారత్‌కు స్థిరమైన సంబంధాలు ఉన్నాయి. భారత ఎనర్జీ సెక్యూరిటీలో కజకిస్థాన్ కీలక భాగస్వామి. ఇటీవల జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నా సంతాపం తెలుపుతున్నా. "
- నరేంద్ర మోదీ, ప్రధానంత్రి.
భారత్-సెంట్రల్ ఆసియా సదస్సులో మూడు లక్ష్యాలను నిర్దేశించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
- మొదటిది.. ప్రాంతీయ భద్రత, శ్రేయస్సుకు దేశాల మధ్య పరస్పర సహకారం అవసరం. సమీకృత, స్థిరమైన పొరుగుదేశంగా ఉండాలనే భారత విజన్‌కు సెంట్రల్ ఆసియా కేంద్రంగా ఉంది.
- రెండోది.. దేశాల మధ్య సహకారానికి సమర్థవంతమైన విధానం ఉండాలి. అది.. భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర చర్యల కోసం ఒక వేదిక ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తుంది.
- మూడోది.. దేశాల మధ్య సహకారానికి ప్రతిష్టాత్మకమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయటం. ఇది ప్రాంతీయ అనుసంధానత, సహకారం కోసం సమగ్ర విధానాన్ని అవలంబించడానికి వీలు కల్పిస్తుంది.
వర్చువల్‌గా జరిగిన ఈ సదస్సుకు కజకిస్థాన్ అధ్యక్షుడు కస్యమ్ జొమార్ట్ టొకయెవ్, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు శవ్కాత్ మిర్జియోయెవ్, తజకిస్థాన్ అధ్యక్షుడు ఎమొమాలి రహ్మోన్, తుర్కెమిస్థాన్ అధ్యక్షుడు గుర్బాంగులి బెర్డిముహామెడోవ్, కిర్గిస్థాన్ రిపబ్లిక్ అధ్యక్షుడు సడైర్ జపరోవ్ హాజరయ్యారు.