అమెది అసోంలోని ఓ కుగ్రామం.. ఆ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు... ఎక్కడికైనా వెళ్లాలన్నా అవస్థలు పడాల్సిందే.. అలాంటి చిన్న ఊర్లో పుట్టిన ఓ యువతి టీమ్ఇండియా జట్టుకు ఎంపికై శభాష్ అనిపించుకుంటోంది. పెద్ద క్రికెటర్‌ను కావాలన్న దృఢ సంకల్పంతో రోజూ దాదాపు 8 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి ప్రాక్టీస్ చేసింది. ఈ ప్రయాణంలో ఎదురైన ఎన్నో అవాంతరాలను దాటుకుని వెళ్లింది. చివరకు అనుకున్నది సాధించింది. జాతీయ మహిళల క్రికెట్ జట్టులో స్థానం సంపాదించింది.
ఉమను అభినందిస్తూ అసోం సీఎం హిమంత ట్వీట్ గోల్ఘాట్ జిల్లా బొకఖాత్ గ్రామానికి చెందిన ఉమా ఛెత్రికి.. చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే పెద్ద క్రికెటర్ కావాలని కఠోర సాధన చేసింది. అందుకోసమే గ్రామానికి సుమారు 8 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి ప్రాక్టీస్ చేసింది. చివరకు మహిళల క్రికెట్ జట్టులో స్థానం సంపాదించింది. అసోం నుంచి జాతీయ క్రికెట్ జట్టలో స్థానం సంపాదించిన తొలి క్రీడాకారిణిగా రికార్డ్ సాధించింది ఉమ.
"క్రికెట్ జట్టులో స్థానం కోసం ఉమ చాలా కష్టపడింది. క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి మా గ్రామం నుంచి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేది. ఆమె పడిన కష్టం ఫలించింది. నా కూతురు మహిళల క్రికెట్ జట్టులో స్థానం సంపాదించడం చాలా ఆనందంగా ఉంది."
--ఉమ తల్లి
జులై 9 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే అంతర్జాతీయ మ్యాచులకు మహిళల జట్టును ప్రకటించింది బీసీసీఐ. అందులో బొకఖాత్ గ్రామానికి చెందిన ఉమా ఛెత్రి పేరు కూడా ఉంది. దీంతో గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సహా అనేక మంది ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అసోం క్రికెట్ అసోసియేషన్ సైతం ఉమను సత్కరించింది. సంఘం తరఫున రూ.5 లక్షల చెక్కును అందజేశారు సెక్రటరీ తరంగ గొగొయ్.
రూ. 5 లక్షల చెక్కును అందజేస్తున్న అసోం క్రికెట్ అసోసియేషన్ మరోవైపు, జట్టులో ఉమా ఛెత్రి స్థానం సంపాదించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర మంత్రి అతుల్ బోరా. ఆమె గ్రామానికి వెళ్లి మరీ అభినందించారు. ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని తెలుసుకున్న మంత్రి.. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. వెంటనే ప్రజా పనుల శాఖ అధికారులకు ఫోన్ చేసి.. రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన అధికారులు.. రోడ్డు నిర్మాణానికి కొలతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. వీలైనంత త్వరగా రోడ్డును పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి :ఎన్నో కష్టాలు దాటి.. క్రికెట్ టీమ్‌లకు కెప్టెన్లుగా నిలిచి..
'కార్టూన్ల బదులు క్రికెట్ చూశా'.. నాన్న దిద్దిన తెలుగు తేజం మన త్రిష!