అనేక సవాళ్ల మధ్య కల్లోలిత అఫ్గానిస్థాన్ నుంచి భారత్.. తన ప్రజలను సురక్షితంగా తరలిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తెలిపారు. ప్రపంచంలో ఎక్కడైనా భారత పౌరుడు కష్టాల్లో ఉంటే.. దేశం వారివెంట ఉంటుందని స్పష్టం చేశారు. అమృత్‌సర్‌లో పునర్నిర్మించిన జలియన్‌వాలాబాగ్ స్మారక సముదాయాన్ని శనివారం ఆయన వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేశారు. కేవలం ప్రజలనే కాకుండా.. పవిత్రమైన గురుగ్రంథ్ సాహిబ్ గ్రంథాలను కూడా భారత్ తీసుకురాగలిగిందన్నారు.
" ప్రపంచ నలుమూలల్లో ఏ భారతీయుడు ఇబ్బందుల్లో ఉన్నా.. భారత్ వారికి అండగా ఉంటుంది. వారికి సాయం చేస్తుంది. అది కరోనా సమయమైనా, అఫ్గాన్ సంక్షోభం అయినా కావొచ్చు. ఈ విషయం ప్రపంచానికి తెలుసు. ఆపరేషన్ దేవీశక్తి పేరుతో వందల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చాం.