India Border Infiltration : భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు సరిహద్దుల వెంబడి 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు వేచిచూస్తున్నారని బీఎస్ఎఫ్ ప్రకటించింది. వారిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు నిఘావర్గాల నుంచి సమాచారం అందినట్లు బీఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. చొరబాట్లకు అవకాశం ఉన్నప్రాంతాల్లో సైన్యం, తాము అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. చొరబాటు ప్రయత్నాలను అడ్డుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కొన్నేళ్ల నుంచి కశ్మీర్ ప్రజలు, భద్రతాదళాల మధ్య సంబంధాలు పెరిగాయని, వారి సహకారం ఇలాగే కొనసాగితే ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేయగలుగుతామని బీఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు.
'అంతర్జాతీయ సరిహద్దులు, నియంత్రణ రేఖ వద్ద చొరబాట్లను నిరోధించడానికి BSF దృఢ సంకల్పంతో పనిచేస్తోంది. చొరబాట్లను ఆపేందుకు సైన్యం, బీఎస్ఎఫ్ కలిసి పనిచేస్తున్నాయి. అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా పరికరాలు సాయపడుతున్నాయి. చొరబాటు ప్రయత్నాల గురించి ఇంటెలిజెన్స్ సమాచారం అందించింది' అని బీఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లో గత కొంతకాలంగా ఉగ్రవాదుల చొరబాటు ఘటనలు తగ్గుముఖం పట్టినప్పటికీ అడపాదడపా పర్వత ప్రాంతాలు, అడవుల గుండా ముష్కరులు సరిహద్దును దాటేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వారిని బీఎస్‌ఎఫ్ దళాలు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాయి. మరోవైపు, జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు కూడా తగ్గినట్లు ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ వేదికగా తెలిపారు. పదేళ్ల క్రితంతో పోలిస్తే కశ్మీర్‌లో ఉగ్రదాడుల ఘటనలు 70శాతం, పౌర మరణాలు 72శాతం, భద్రతా దళాల మరణాలు 59శాతం తగ్గుముఖం పట్టాయని అమిత్ షా వెల్లడించారు.