గుజరాత్ వడోదరలో నిర్మించనున్న సీ-295 రవాణా విమానాల తయారీ కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో శిలాఫలకాన్ని రిమోట్ బటన్ నొక్కి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని.. ఈ ప్లాంటులో తయారు చేసే రవాణా విమానాలు.. మన సైన్యానికి కొత్త శక్తిని అందిస్తాయని పేర్కొన్నారు. త్వరలో మేక్ ఇన్ ఇండియా ట్యాగ్‌తో.. ప్రయాణికుల విమానాన్ని కూడా భారత్ రూపొందిస్తుందని ఆకాంక్షించారు.
"ఇక్కడ తయారు చేసే రవాణా విమానాలు మన సైన్యానికి శక్తిని ఇవ్వడమే కాకుండా విమానాల తయారీలో కొత్త పంథాకు నాంది పలుకుతాయి. త్వరలో మేక్ ఇన్ ఇండియా ట్యాగ్‌తో తయారయ్యే ప్రయాణికుల విమానానికి భారత్ సాక్ష్యంగా నిలవనుంది. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న రంగాల్లో విమానయాన రంగం ఒకటి. విమాన ట్రాఫిక్‌లో ప్రపంచంలోని టాప్-3 దేశాల జాబితాలోకి భారత్ ప్రవేశించబోతోంది. రాబోయే 10-15 ఏళ్లలో భారతదేశానికి కొత్తగా 2 వేల ప్రయాణికులు, కార్గో విమానాలు అవసరమవుతాయి. దీన్ని బట్టి చూస్తే భారత్ ఎంతగా అభివృద్ధి చెందుతుందో అవగతమవుతోంది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి