India Book of Records 2021 Kerala: కేరళ కాసరగోడ్‌కు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి బాల పార్వతి తన జ్ఞాపకశక్తితో ఔరా అనిపిస్తోంది. మంత్రుల పేర్లను చకచకా చెప్పేస్తోంది. అంతేకాదు.. స్వాతంత్య్ర సమరయోధులు, పలు దేశాల జెండాల ఫొటోలను తన ముందు పెడితే ఇట్టే గుర్తుపడుతోంది. చిన్నవయసులోనే ఈ అసాధారణ ప్రతిభతోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకుంది.
కాసరగోడ్‌కు చెందిన హరీశ్, సుకన్య దంపతుల ఏకైక కుమార్తె బాల పార్వతి. ఏడాది వయసులోనే తన కుమార్తెలో ప్రత్యేక ప్రతిభను గుర్తించారు హరీశ్, సుకన్య. జనరల్ నాలెడ్జ్ సహా పలు అంశాలపై అవగాహన కల్పించారు. దగ్గరుండి అన్నీ నేర్పించారు. ఈ క్రమంలోనే నేపథ్య సంగీతం విని.. ఆ పాటలను పసిగట్టే నైపుణ్యాన్ని పార్వతి సొంతం చేసుకుంది. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో పాటలను పాడేస్తోంది. ఈ ప్రతిభతో అందరితో 'వావ్' అనిపించుకుంటోంది.
"ఏమి తెలియని వయసులోనే మా వద్దకు పుస్తకాలు తీసుకొచ్చి.. అందులో ఏమున్నాయో చెప్పమని మమ్మల్ని అడిగేది. అలా మేము ఆమెకు చాలా విషయాలు నేర్పడం ప్రారంభించాం. తర్వాత వాటిని అడిగితే తడబడకుండా సమాధానం చెబుతుంది."