భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలిసారి 2 ప్లస్ 2 చర్చలు జరిగాయి. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేలా ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు కీలక చర్చలు జరిపారు. అఫ్గానిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెంచుకునేందుకు దుందుడుకు విధానాలను అవలంబించడం వంటి పరిస్థితుల మధ్య ఈ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మరైస్ పైన్‌తో చర్చలు ఫలప్రదంగా జరిగాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు చెప్పారు. రక్షణ రంగంలో సహకారం పెంపొందించేందుకు ప్రతిష్ఠాత్మక ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
"అత్యంత కీలకమైన సమయంలో ఈ సమావేశం జరుగుతోంది. కొవిడ్‌తో పాటు భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే విధంగా ఆలోచించే భాగస్వాములతో చర్చించి దేశ ప్రయోజనాలను కాపాడుకోవాలి. అదే సమయంలో.. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత ఉండేలా చర్యలు తీసుకోవాలి. అతి కొద్ది దేశాలతోనే భారత్ 2 ప్లస్ 2 చర్చలు జరుపుతోంది. ఈ రోజు జరిగిన సమావేశాల్లో అఫ్గాన్ పరిణామాలు ప్రధాన చర్చనీయాంశంగా ఉంది."
- జైశంకర్, భారత విదేశాంగ మంత్రి
అమెరికాలోని 9/11 దాడులు జరిగి 20 ఏళ్లైన నేపథ్యంలో ఈ విషయంపైనా స్పందించారు జైశంకర్. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన గుర్తు చేస్తోందని అన్నారు.
'దానిపైనే ఇరుదేశాల బంధం'
అఫ్గాన్‌లో భద్రతా పరిస్థితులు సహా ఉగ్రవాద కట్టడిపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి డట్టన్‌తో చర్చించారు. అఫ్గాన్ పరిణామాల వల్ల ఇరుదేశాలకు ఎదురయ్యే ముప్పు గురించి సమాలోచనలు జరిపారు. ప్రజాస్వామ్య దేశాలుగా ఇరువురి ప్రయోజనాలు శాంతి, సుస్థిరతలతోనే ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. భారత్, ఆస్ట్రేలియా కీలకమైన భాగస్వామ్య దేశాలని అన్నారు. 'స్వేచ్ఛాయుత, సమీకృత, సుసంపన్న ఇండో పసిఫిక్,' అనే భావనపై ఇరుదేశాల బంధం ఆధారపడి ఉందని చెప్పారు.