వైమానిక దళానికి ప్రభుత్వం మళ్లీ కొత్త రక్తం ఎక్కిస్తోంది. దేశీయ తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ఎంకే1ఏ రకం కొనుగోలుకు నిన్న కేబినెట్ కమిటీ ఆమోదముద్రవేసింది. దీంతో మరో 83 విమానాలు మరికొన్నేళ్లలో భారత్ అమ్ములపొదిలో చేరనున్నాయి. వాస్తవానికి 35ఏళ్లకు పైగా సుదీర్ఘకాలం పాటు సాగిన ప్రాజెక్టు.. ఉత్పత్తి మందకొడిగా ఉంది.. విదేశీ పరికరాల వినియోగం ఎక్కువ.. ఇలా తేజస్పై పలు విమర్శలు వచ్చాయి. కానీ, ఈ విమానం సామర్థ్యంపై మాత్రం ఎటువంటి విమర్శలు లేవు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఎల్సీఏ(తేలికపాటి యుద్ధవిమానం) విభాగంలో తేజస్ ప్రపంచంలోనే అత్యుత్తమైందని చెబుతారు.
వాయుసేనకు యుద్ధవిమానాల కొరత తీవ్రంగా ఉంది. వాస్తవానికి వాయుసేన అవసరాలు తీర్చాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 42 స్క్వాడ్రన్లు ఉండాలి. కానీ, కాలం చెల్లిన మిగ్ల తొలగింపు.. విమాన ప్రమాదాల కారణంగా వీటి సంఖ్య దాదాపు 30కి అటు ఇటుగా చేరింది. 18 విమానాల జట్టును స్క్వాడ్రన్గా భావిస్తారు. ఇప్పుడు తాజా మరో 83 తేజస్ విమానాలు 2026నాటికి వాయసేనలో చేరనున్నాయి. తొలి విమానం 2022లో చేతికి అందగా.. ఈ మోడల్ తొలి స్క్వాడ్రన్ 2024లో పూర్తికానుంది.
అసలు ఎల్సీఏ ఎంకే1ఏ ఏమిటీ..?
తొలితరం తేజస్తో పోలిస్తే ఎంకే1ఏ రకంలో చాలా మార్పులు చేయనున్నారు. ఇప్పటికే వాయుసేనలో ఉన్న తేజస్ ఎంకే1(ఎఫ్వోసీ)కి ఇది అడ్వాన్స్ మోడల్. దీనిలో క్వాడ్రప్లక్స్ డిజిటల్ ఫ్లైబైవైర్ వ్యవస్థను వినియోగించారు. విమానం బరువు తగ్గించేందుకు తయారీలో ప్రత్యేక మిశ్రమ లోహాలను వినియోగించారు. వీటి వల్ల విమానం ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. ఇది 3,500 కిలోల ఆయుధాలను తీసుకెళ్లగలదు. భూమి 15 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణిస్తూ దాడుల్లో పాల్గొనగలదు. గాల్లోనే ఇంధనం నింపుకొనే సామర్థ్యం కూడా దీనికి ఉంది. ఇది సూపర్సానిక్ వేగంతో ప్రయాణించగలదు.
70కి పైగా దేశీయ సంస్థల నుంచి..
తేజస్ ఏంకే1ఏలో దేశీయ పరికరాలు 50శాతం నుంచి 60శాతానికి చేర్చనున్నారు. లార్సన్ అండ్ టుబ్రో, డైనమాటిక్ టెక్నాలజీస్, ఆల్ఫాడిజైన్ వంటి 70కిపైగా ప్రముఖ సంస్థలు దీనిలో తయారీలో భాగస్వాములు. అంతేకాదు ఉత్పత్తిని వేగవంతం చేయడానికి హెచ్ఏఎల్ నాసిక్, బెంగళూరు డివిజన్లలో రెండో తయారీ యునిట్లను కూడా సిద్ధం చేసింది. ప్రస్తుతం హాల్లో ఏడాదికి 8 విమానాలను మాత్రమే తయారు చేస్తున్నారు. దీనిని 16 విమానాల స్థాయికి తీసుకెళ్లనున్నారు. ఇక్కడ అదనపు సౌకర్యాల కోసం ప్రభుత్వం కూడా రూ.1200 కోట్లను మంజూరు చేసింది. దీంతోపాటు వచ్చే సరికొత్త విమానాల కోసం బేసుల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
విదేశీ బెదిరింపులకు కొంత అడ్డుకట్ట..
సగానికి పైగా దేశీయ పరికరాలనే వినియోగంచడంతో ఈ విమానాల నిర్వహణ సులువుగా మారనుంది. గతంలో విదేశాల నుంచి విడిభాగాలను తెచ్చుకోవాలంటే సవాలక్ష నిబంధనలు పాటించాల్సి వచ్చేది. కీలక యుద్ధసమయాల్లో విదేశాలు విడిభాగాలు సరఫరాలను నిలిపేసిన సంఘటనలను వాయుసేన చవిచూసింది. ఇప్పుడు ఈ బాధ కొంత తప్పుతుంది.