చైనాతో తలపడేందుకు భారత్ మరో కొత్త ఆయుధం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఉన్న త్రివిధ దళాలకు తోడు రాకెట్ ఫోర్స్‌ను తయారు చేసేందుకు ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం బాలిస్టిక్, క్రూయిజ్, క్వాజీ బాలిస్టిక్ క్షిపణలను అభివృద్ధి చేస్తోంది. రాకెట్ ఫోర్సును ఏర్పాటు చేసే దిశగానే ఈ అడుగులు పడుతున్నట్లు రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
చైనా 1966లోనే ఇటువంటి రాకెట్ ఫోర్సుకు పునాది వేసింది. 2015లో పీఎల్‌ఏ 2వ ఆర్టిలెరీ ఫోర్స్ పేరు మార్చి రాకెట్ ఫోర్సుగా చేసింది. దీని వద్దే చైనాలో అత్యధిక అణ్వాయుధాలు ఉన్నాయి. మూడేళ్లలో దీని సైజును 33 శాతం పెంచినట్లు వార్తలొస్తున్నాయి. దీని పరిధిలోకి భారత్‌లోని నగరాలన్నీ వస్తాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యాధునిక రాకెట్ ఫోర్స్ కలిగిన దేశాల్లో డ్రాగన్ అగ్రభాగాన నిలిచింది. భారత్‌తో సరిహద్దు వివాదం రేగగానే చైనాకు చెందిన రాకెట్ ఫోర్స్‌ను వాస్తవాధీన రేఖ వద్ద మోహరించింది. ఈ క్రమంలో భారత్ కూడా ఇటీవల రాకెట్ ఫోర్స్ ఏర్పాటుపై దృష్టి పెట్టింది.
ఏమిటీ రాకెట్ ఫోర్స్..?
భవిష్యత్తులో యుద్ధాలు నేరుగా జరగవు.. దళాలు ముఖాముఖీ తలపడే సమయానికి శత్రువును పూర్తిగా కుంగదీసేస్తారు. ఇలాంటి వ్యూహంలో భాగంగానే ఉక్రెయిన్ పై రష్యా తొలి రోజు క్షిపణుల వర్షం కురిపించి కీలక మౌలిక వసతులను ధ్వంసం చేసింది. క్షిపణులు, డ్రోన్లు, సైబర్ ఆయుధాలే కీలక పాత్ర పోషిస్తాయి. "భవిష్యత్తు యుద్ధాలు చాలావరకూ 'కాంటాక్ట్ లెస్', మానవ రహితంగా జరుగుతాయి. ట్యాంకులు, సైనిక పోరాటాల కంటే సుదూరం నుంచి ప్రయోగించే స్టాండ్ ఆఫ్ ఆయుధాలు, సైబర్ ఆయుధాలు, రహస్య కార్యకలాపాలతో జరుగుతాయి" అని సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్‌కు రాసిన పేపర్‌లో బ్రిగేడియార్ బిమల్ మోంగా పేర్కొన్నారు.
భారత్ రాకెట్ ఫోర్సుకు సన్నాహాలు..
భారత్ గత కొన్ని నెలలుగా రాకెట్ ఫోర్స్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో నాటి సీడీఎస్ దివంగత బిపిన్ రావత్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ క్రమంలో భాగంగానే ప్రళయ్ క్షిపణిని వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇది 150-500 కిలోమీటర్ల మధ్య లక్ష్యాలను ఛేదించగలదు.
పైగా ఇది క్వాజీ బాలిస్టిక్ విధానంలో ప్రయాణిస్తుంది. అంటే బాలిస్టిక్ క్షిపణి మాదిరిగా వెళ్లినా.. అవసరమైన సమయంలో దిశ మార్చుకోగలదు. దీంతో శత్రు గగనతల రక్షణ వ్యవస్థలు వీటిని గుర్తించలేవు. అంటే వాస్తవాధీన రేఖ సమీపంలో చైనా సైనిక మౌలిక వసతులను ఇది ధ్వంసం చేయగలదు. తాజాగా ఈ క్షిపణి అభివృద్ధిని వేగవంతం చేసింది. ఇటీవలే 24 గంటల వ్యవధిలో రెండు సార్లు దీనిని పరీక్షించింది. తాజాగా 120 క్షిపణుల కొనుగోలు ఆర్డర్‌కు రక్షణశాఖ క్లియరెన్స్ లభించింది. ఈ క్షిపణిని సబ్‌మెరైన్ నుంచి ప్రయోగించే కె-సిరీస్ క్షిపణి నుంచి అభివృద్ధి చేశారు.