Modi Inaugurated IECC In Delhi : బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తే.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. వృద్ధిరేటు సైతం మరింత పెరుగుతుందన్నారు. రానున్న 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తయారుచేయడమే తమ లక్ష్యమని మోదీ వెల్లడించారు. భారత్ ప్రజాస్వామ్యానికి మాతృక అనే విషయాన్ని ప్రపంచం అంగీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. బుధవారం దిల్లీలో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (IECC) కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మోదీ అనంతరం మాట్లాడారు. ఐఈసీసీకి 'భారత్ మండపం' అని నామకరణం చేశారు.
భారత్ కచ్చితంగా పేదరికాన్ని రూపుమాపగలదని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. 13.5 కోట్ల భారతీయులు పేదరికం నుంచి బయటపడినట్లు.. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక ఆయన ప్రస్తావించారు. తమ తొమ్మిదేళ్ల హయాంలో విమానాశ్రయాల సంఖ్య, రైల్వే లైన్ విద్యుదీకరణ భారీగా పెరిగిందన్నారు. 2014లో బీజేపీ అధికారం చేపట్టినప్పుడు ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉండేదన్న ప్రధాని.. ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు.