India Alliance Ram Mandir :అయోధ్య ప్రాణప్రతిష్ఠ ఘనతను అధికార బీజేపీ తన ఖాతాలో వేసుకోవడాన్ని దీటుగా ఎదుర్కొవాలని విపక్ష ఇండియా కూటమి భావిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడం వల్ల ప్రతిపక్ష కూటమిలోని అన్ని పార్టీలు సమావేశమై ఈ అంశంపై బీజేపీని ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచించాలని చూస్తున్నాయి. అతి ముఖ్యమైన సీట్ల సర్దుబాటుపైనా చర్చలు జరుగుతున్నాయని కూటమిలోని ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీ మహూవా మాఝీ తెలిపారు. విపక్ష పార్టీలు అన్ని కలిసి అధికార బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతాయని చెప్పారు.
"పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే విపక్ష పార్టీలు అన్ని కలిసి బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలను రచించాలి. దేశంలో ప్రధాన సమస్యలైన ధరల పెరుగుదల, నిరుద్యోగం లాంటి అంశాలపై దృష్టి పెట్టకుండా బీజేపీ మతాలతో ఆడుకుటోంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఓటు బ్యాంక్ రాజకీయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మా ఇండియా కూటమిలో వివిధ మతాలకు చెందిన నేతలు ఉన్నారు. కానీ మేమెప్పుడూ వాటితో రాజకీయాలు చేయలేదు. సీట్ల సర్దుబాటపై రాష్ట్ర నేతలే చర్చిస్తారు. అక్కడ ఏమైనా భేదాభ్రియాలు వస్తే కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది."
--మహూవా మాఝీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీ
సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మరో ఎంపీ సైతం అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ విషయంలో బీజేపీపై మండిపడ్డారు. రామమందిరాన్ని అడ్డంపెట్టుకుని బీజేపీ ఓట్లు సంపాదించుకోవాలని చూస్తోందని దుయ్యబట్టారు. రామ మందిర నిర్మాణం పూర్తి కాకపోయినా, ఓ వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు హడావుడిగా ప్రాణప్రతిష్ఠ చేస్తుందని ఆరోపించారు.
'వారు నియమాలు పాటించడం లేదు'
సనతాన ధర్మంలోని విధానాలను పాటించనందున, దేశంలోని నలుగురు శంకరాచార్యులు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ఉత్తరాఖండ్‌లోని జ్యోతిష్‌పీఠ్ శంకరాచార్యులు అవిముక్తేశ్వరానంద్ సరస్వతి తెలిపారు.