India Alliance Protest Over MPs Suspension :పార్లమెంటులో విపక్ష ఎంపీలను ఎంపీలను బయటకు పంపించి ప్రభుత్వం 60 శాతం మంది భారతీయుల గొంతు నొక్కిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ ఎంత ద్వేషం వ్యాపింపజేస్తే, ఇండియా పార్టీలు అంత ప్రేమను పంచుతాయన్నారు. 146మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనలకు చేపట్టిన సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
" ఇద్దరు ముగ్గురు యువకులు పార్లమెంటులోకి ప్రవేశించి పొగను విడుదల చేశారు. ఆ సమయంలో బీజేపీ ఎంపీలు పారిపోయారు. ఈ సంఘటనలో భద్రతా ఉల్లంఘనపై ప్రశ్న తలెత్తుతోంది. దీంతోపాటు వారు ఈ విధంగా ఎందుకు నిరసన తెలిపారు? అనే ప్రశ్న ఎదురవుతోంది. దేశంలో నిరుద్యోగమే సమాధానం. దేశంలో నిరుద్యోగం గురించి మీడియా మాట్లాడలేదు. కానీ సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంట్ బయట కూర్చున్న వీడియోను రాహుల్ గాంధీ రికార్డ్ చేస్తే, దాని గురించి మాట్లాడింది"
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
మమ్మల్ని భయపెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు : ఖర్గే
నిరసన సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును దుయ్యబట్టారు. 'మనం (ఇండియా కూటమి) కలిసికట్టుగా పోరాడాలి. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల ద్వారా మనల్ని భయపెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. కానీ అలాంటి వాటికి కాంగ్రెస్ భయపడదు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉన్నందున కూటమి పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చాయి. మీరు (బీజేపీ) ఎంతగా మమ్మల్ని తొక్కాలని ప్రయత్నిస్తున్నారో, మేము అంతగా పైకి లేస్తాం. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మేము ఐక్యంగా పోరాడుతాం. మేమందరం కలిసికట్టుగా ఉంటే నరేంద్ర మోదీ ఏం చేయలేరు' ఖర్గే విమర్శించారు.