India Alliance PM Candidate :ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు బంగాల్, దిల్లీ ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ, కేజ్రీవాల్. అయితే ఈ ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. పార్లమెంటు ఎన్నికల్లో విపక్ష కూటమి గెలుపే ముఖ్యమని, ఇతర విషయాలపై తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని ఖర్గే పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రచారసభల నిర్వహణే అజెండాగా దిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరిగింది. ఈ భేటీలో పార్లమెంటు ఉభయసభల్లో 141 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను ఖండిస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఈనెల 22న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఖర్గే తెలిపారు. దేశవ్యాప్తంగా 8 నుంచి 10 వరకు ఇండియా కూటమి సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
"ఇండియా కూటమి సమష్టి పోరాటమే ప్రధాన కర్తవ్యంగా చర్చ జరిగింది. ముందు పోరాటం చేసి గెలిచిన తర్వాత, ప్రధాని ఎవరనేది నిర్ణయం తీసుకుంటాం. దేశ వ్యాప్తంగా 8 నుంచి 10 సమావేశాలు నిర్వహించనున్నాము. ఒకే గొడుగు కిందకు రాకపోతే కూటమి ప్రాధాన్యాన్ని ప్రజలు గుర్తించే అవకాశం లేదు. అధికార బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు, ఆందోళనలు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించాము. పార్లమెంటులో దాడి విషయాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ప్రధాని, హోం మంత్రి ఇరువురు సభకు హాజరై వివరణ ఇవ్వాలి. పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ప్రధాని ప్రారంభోత్సవాలకు, పర్యటనలకు పరిమితం అవుతున్నారు. పార్లమెంటుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. పార్లమెంటు చరిత్రలో తొలిసారి ఇంత మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. మోదీ ప్రజాస్వామ్యాన్ని నమోస్వామ్యంగా మార్చారు.
ప్రజలతో మమేకం అయ్యి పోరాటం కొనసాగించాలని కూటమి నిర్ణయించింది. ఈనెల 22న ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళన నిర్వహిస్తాము. సీట్ల సర్దుబాటులో కూటమి పార్టీలన్నీ కలిసి కట్టుగా నిర్ణయం తీసుకుంటాయి. రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, బిహార్, ఉత్తరప్రదేశ్ లాంటి జఠిలమైన రాష్ట్రాల్లో కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుంది. దిల్లీ, పంజాబ్‌లకు సంబంధించిన వ్యూహాన్ని తరువాత ఖరారు చేస్తాము."
--మల్లిఖార్జున ఖర్గే