INDIA Alliance Parties Seat Sharing : 'ఇండియా' పార్టీల మధ్య సీట్ల పంపకం ప్రక్రియ ప్రారంభించాలని ఆ కూటమి సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. కూటమిలోని పార్టీలు దీనిపై చర్చలు జరుపుతాయని తెలిపారు. వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయానికి వస్తాయని స్పష్టం చేశారు. ఇండియా కూటమి సమన్వయ కమిటీ తొలి సమావేశం ఇదే కాగా.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దిల్లీ నివాసంలో బుధవారం ఈ భేటీ నిర్వహించారు. 12 పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. "టీఎంసీ ప్రతినిధిగా అభిషేక్ బెనర్జీ సమావేశానికి రాలేకపోయారు. బీజేపీ ప్రతీకార రాజకీయాల్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనకు సమన్లు ఇచ్చింది. అందుకే ఆయన గైర్హాజరయ్యారు" అని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.
భోపాల్లో తొలి సభ
ఈ సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కూటమి తరఫున భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలి సభను అక్టోబర్ తొలి వారంలో భోపాల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, బీజేపీ సర్కారు అవినీతిపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు ఉమ్మడి ప్రకటనలో కమిటీ నేతలు తెలిపారు. కులగణన వ్యవహారాన్ని సైతం ప్రస్తావించాలని సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఆ 'న్యూస్ షో'లకు బంద్
అదే సమయంలో.. మీడియా సమావేశాలకు సంబంధించి ఓ సబ్గ్రూప్ను ఏర్పాటు చేయాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. ఏఏ న్యూస్ యాంకర్ల కార్యక్రమాల్లో ఇండియా కూటమి నేతలు పాల్గొనకూడదనే విషయంపై ఈ సబ్ గ్రూప్ నిర్ణయానికి వస్తుందని తెలిపింది.