India Alliance Parties on Congress Party :సార్వత్రిక ఎన్నికల సెమీఫైనల్‌గా భావించే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పేలవమైన ప్రదర్శన చేసింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అధికారాన్ని కాపాడుకోలేకపోగా, ఇటు మధ్యప్రదేశ్‌లోనూ అవకాశాన్ని కోల్పోయింది. ఒక్క తెలంగాణలో మాత్రమే సానుకూల ఫలితాన్ని సాధించింది. దీంతో కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్ తీరును తప్పుపడుతున్నాయి. విపక్షాల మద్దతు తీసుకోకుండా ఒంటెద్దు పోకడతో వెళ్లడం వల్లే పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రతికూల ఫలితాలను చవిచూడాల్సి వచ్చిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకొని, కూటమిలోని పక్షాలతో కలిసి నడవాలని సూచిస్తున్నాయి.
కూటమిపై ప్రభావం చూపుతుందా?
అయితే, మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చెందడం ఇండియా కూటమిపై ప్రభావం చూపదని ఎన్‌సీపీ నేత శరద్ పవార్, జేడీయు నేత కేసీ త్యాగి చెప్పారు. భాగస్వామ్య పక్షాలను దూరంగా పెట్టి ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లడం వల్లే కాంగ్రెస్ ప్రతికూల ఫలితాలు ఎదుర్కొందని కేసీ త్యాగి విమర్శించారు. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనేటప్పుడు యునైటెడ్ ఫ్రంట్ ఎంతో అవసరమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే గెలిచామని, తమను ఎవ్వరూ ఓడించలేరనే ధీమాతో వెళ్లడమే కాంగ్రెస్ పతనానికి దారితీసిందని తెలిపారు.
మూడు రాష్ట్రాల ఫలితాలు బీజేపీ విజయం కాదని, అది కాంగ్రెస్ వైఫల్యమేనని తృణమూల్ కాంగ్రెస్ నేత కునాల్ ఘోష్ అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు తృణమూల్ తనవంతు కృషి చేస్తుందని చెప్పారు. ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసి ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రాధాన్యం పెంచుకోవాలని చూసిందని ఆ కూటమికి చెందిన ఓ నేత వ్యాఖ్యానించారు. అందుకే చాలాకాలంగా ఇండియా కూటమికి కాంగ్రెస్ దూరంగా ఉందని చెప్పారు. ఈ క్రమంలో తాజా ఫలితాలు కాంగ్రెస్ పార్టీ ఆలోచనా తీరులో మార్పు తీసుకువస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.