INDIA Alliance Meeting Mumbai : ప్రతిపక్ష కూటమి 'ఇండియా' మూడో సమావేశం గురువారం ముంబయిలో జరగనుంది. కూటమి సభ్యులు రెండు రోజుల పాటు భవిష్యత్ కార్యాచరణపై మంతనాలు జరపనున్నారు. తొలి సమావేశం పట్నా, రెండో భేటీ బెంగళూరులో విజయవంతంగా నిర్వహించిన విపక్ష కూటమి ఇండియా.. అదే ఉత్సాహంతో ముంబయి సమావేశాలకు సిద్ధమైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని సమర్థంగా ఎదుర్కొనే వ్యూహంతోపాటు ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాల పరిష్కారం, కూటమి లోగో ఆవిష్కరణ అజెండాతో ఈ భేటీ జరగనున్నట్లు ఇండియా కూటమి నేతలు తెలిపారు.
'ఎన్సీపీపై సందేహాలు వద్దు'
Sharad Pawar Opposition Meet :ఈ సమావేశానికి కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ కూడా హాజరుకానున్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. 28 రాజకీయ పార్టీలకు చెందిన 63 మంది ప్రతినిధులు ఈ భేటీకి హాజరుకానున్నట్లు.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తెలిపారు. రాజకీయ మార్పు కోసం బలమైన ప్రత్యామ్నాయాన్ని ప్రతిపక్ష కూటమి అందిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సీట్ల పంపకంపై ఇంతవరకు చర్చ జరగలేదని పవార్ తేల్చిచెప్పారు. ఎన్సీపీపై సందేహాలు వద్దని, పార్టీని వీడిన వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పవార్ జోస్యం చెప్పారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎవరి పక్షమో తెలియదని తెలిపారు.
ఇండియా కూటమిలోని పార్టీలు భిన్నమైన సిద్ధాంతాలు కలిగి ఉన్నప్పటికీ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే వాటి ఉమ్మడి అజెండా అని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతెలిపారు. 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 22కోట్ల ఓట్లు సాధించగా.. భాజపాయేతర పార్టీలకు 23కోట్ల ఓట్లు వచ్చినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ తెలిపారు. కూటమి పార్టీలన్నీ కలిసి పనిచేస్తే.. గెలుపు తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
'బీజేపీ వెళ్లిపో'(BJP Chale Jao) అనే నినాదంతో కూటమి సమావేశం జరుగుతుందని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానా పటోలే అన్నారు. కూటమిలో చాలా మందికి ప్రధాని పదవి చేపట్టే సామర్థ్యం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 'ఎన్డీఏ' కూటమిలో ఇప్పుడున్న కొన్ని పార్టీలు 'ఇండియా' కూటమిలోకి రావచ్చన్నారు. కాగా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు ముంబయి చేరుకున్నారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. శివసేన(యూబీటీ) నాయకుడు ఆదిత్య ఠాక్రే, ఇతర కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు ఆమెకు ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు.
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి రేసులో కేజ్రీవాల్..
Kejriwal Opposition Meet :ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్‌ఉండాలని కోరుకుంటున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కడ్ తెలిపారు. ఆయన అమలు చేసిన అభివృద్ధి నమూనా దేశం మొత్తానికి ప్రయోజనం కలిగిస్తుందన్నారు. కేజ్రీవాల్ ఎల్లప్పుడు ప్రజా అనుకూల బడ్జెట్ ప్రవేశపెట్టడం సహా.. తరుచూ ప్రజాసమస్యలను లేవనెత్తుతుంటారని కక్కడ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాసేపటికే స్పష్టతనిచ్చింది ఆప్.