India Alliance Meeting In Delhi :విపక్ష 'ఇండియా' కూటమి నేతలు డిసెంబర్ 6న దిల్లీలో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో బుధవారం సాయంత్రం భేటీ అయి.. 2024 లోక్సభ ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా బీజేపీని ఎదుర్కోవడంపై నేతలు సమాలోచనలు జరపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సార్వత్రిక సమరానికి సెమీ ఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విపక్ష ఇండియా కూటమి నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియా కూటమిలో కీలక భాగస్వామి అయిన కాంగ్రెస్.. తెలంగాణలో సత్తా చాటినా, హిందీ రాష్ట్రాల్లో మాత్రం వెనుకబడింది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై విపక్ష నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
లోకసభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కొనేందుకు సుమారు 26 పార్టీలు ఏకమై 'ఇండియా' కూటమిగా ఏర్పడ్డాయి. కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రాకుండా చేయడానికి పార్టీలు కలిశాయి. ఇప్పటి వరకు ఈ కూటమి పట్నా, బెంగళూరు, ముంబయిలో మూడు సమావేశాలను నిర్వహించింది. ముంబయి సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని తీర్మానాలను ఆమోదించింది ఇండియా కూటమి. అయితే నాలుగో సమావేశాన్ని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా వేసింది. డిసెంబర్ 6న దిల్లీలోని మల్లికార్జున్ ఖర్గే ఇంటిలో జరిగే ఈ సమావేశంలో కీలక విషయాలతో పాటు.. పార్టీల మధ్య సీట్ల పంపీణీపై చర్చలు జరగవచ్చని సమాచారం.