కరోనా వ్యాక్సినేషన్లో (covid vaccination) నూతన మైలురాయిని అందుకుంది భారత్. శుక్రవారం కోటికిపైగా టీకాలు వేసింది. దేశంలో ఒక్క రోజులో ఇచ్చిన టీకాల్లో ఇదే అత్యధికం. కొవిన్ పోర్టల్ ప్రకారం శుక్రవారం ఒక్కరోజే .. 1,00,64,032 డోసులు పంపిణీ చేసింది.
దేశవ్యాప్తంగా టీకా పంపిణీలో మరో ఘనత సొంతం చేసుకుంది భారత్. ఆగస్టు 27 సాయంత్రం 7గంటల వరకు మొత్తం మీదా 62.09కోట్ల డోసులను అందించినట్లు ప్రభుత్వ నివేదిక తెలిపింది. 18-44 ఏళ్ల వారిలో 23,72,15,353 మంది తొలి డోసు, 2,45,60,807 మంది రెండో డోసు తీసుకున్నట్లు వెల్లడించింది.
ప్రధాని ట్వీట్..
వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న అధికారులను, సిబ్బందిని ప్రధాని మోదీ ప్రశంసించారు. ' ఈ రోజు వ్యాక్సినేషన్ నంబర్లు ఓ రికార్డు. కోటి డోసులు దాటడం.. ఓ పెద్ద విజయం. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి ధన్యవాదాలు.' అని ట్వీట్టర్ ద్వారా ప్రధాని మోదీ పేర్కొన్నారు.
రాష్ట్రాల వద్ద 4కోట్ల టీకాలు..
4.05కోట్లకు పైగా టీకా డోసులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు వాటికి 58.86కోట్ల డోసులకు పైగా పంపించామని, మరో 17.64 లక్షల డోసులు పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి:భారత్‌లో కొవిడ్ అధ్యయనానికి గిన్నిస్ రికార్డ్!