కరోనా సంక్షోభం వేళ భవిష్యత్తుపై భారత్ విశ్వాసం కలిగించిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన 'డెక్కన్ డైలాగ్' ఆన్లైన్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మహమ్మారికి ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకున్నా గణనీయమైన పురోగతి సాధించిందన్నారు.
"కొన్ని నెలల క్రితం టెస్టింగ్ కిట్లు, వెంటిలెటర్లు తదితరాలు దేశంలో ఉత్పత్తి కాకపోయినప్పటికీ... ప్రస్తుతం దేశ ఆవసరాల కంటే ఎక్కువ ఉత్పత్తి చేయగలిగే స్థితికి చేరుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా అందరికి వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూసేందుకు సహాయపడతామని ఐక్యరాజ్యసమితికి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. కరోనా చికిత్సలో ఉపయోగపడే హైడ్రాక్సీక్లోరోక్విన్, ప్యారసిటమాల్ లాంటి ఔషధాల ఉత్పత్తిని పెంచి 150 దేశాలకు సరఫరా చేశాం. ఇందులో సగానికి పైగా దేశాలకు సొంత ఖర్చుతో అందించాం."