ఐరోపా దేశాలకు భారత్ నుంచి వాణిజ్య విస్తరణ పేరుతో... 1605 నుంచి 1627 మధ్య నాటి మొఘల్ చక్రవర్తితో ఒప్పందం చేసుకున్న ఆంగ్లేయులు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరిట క్రమంగా.. యావత్ దేశాన్నే ఆక్రమించేశారు. మొఘల్ సామాజ్ర్యం కుప్పకూలిన తర్వాత విభజించు పాలించు కుట్రతో యావత్‌దేశాన్నీ తామ అధీనంలోకి తెచ్చుకున్నారు. సాయం పేరుతో నాటి రాజుల మధ్య యుద్ధాలు సృష్టించి.. తర్వాత వారి రాజ్యాలనే వశం చేసుకున్నారు. 1757లో ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాను ఓడించడంతో దేశంలో బ్రిటిష్ కాలనీల ఏర్పాటుకు దారితీసింది. పులి తివార్, టిప్పు సుల్తాన్, వీరపాండ్య కట్టబొమ్మన్, ధీరన్ చిన్నమలై, మరూతు పాండియార్ వంటి దక్షిణాది రాజులు బ్రిటిష్ సేనలతో పోరాడి ప్రాణాలనే అర్పించారు. అనంతరం దేశ ప్రజల్లో పురుడు పోసుకున్న స్వాతంత్ర్య ఆకాంక్ష.. క్రమక్రమంగా పెరుగుతూ మహోజ్వల ఉద్యమానికి నాందిపలికింది.
ఉద్యమానికి ఊపిరిలూది..
లక్షలాది భారతీయుల్ని ఏకతాటిపై తెచ్చి, కులమతాలకు అతీతంగా సాగిన స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో మంది భరతమాత ముద్దుబిడ్డలు ధన, మాన, ప్రాణాలను త్రుణప్రాయంగా వదిలేశారు. కవులు, కళాకారులు తమ కలం, గళంతో ఉద్యమానికి ఊపిరిలూదారు. బంకించంద్ర చటర్జీ రాసిన వందేమాతరం గీతం లక్షలాది గొంతుల్లో ప్రతిధ్వనిస్తే, తెలుగు కవి గరిమెళ్ల రాసిన మాకొద్దీ తెల్లదొరతనం గేయం బ్రిటిష్ పాలకులకు కంటి మీద కునుకులేకుండా చేసింది. బ్రిటిష్ పాలకుల దాష్టీకాలను భరించలేక హింసాయుతమార్గంలో పోరు సలిపినవారు కొందరైతే ఎంతో ఓరిమితో మహాత్ముడు చూపిన అహింసా మార్గంలో పోరాడిన వారు అసంఖ్యాకులు. మార్గమేదైనా అందరీ ఆకాంక్ష స్వయం పాలనే, స్వాతంత్ర్య సాధనే.
సిపాయిల తిరుగుబాటుతో మొదలు..
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకమైనది 1857 సిపాయిల తిరుగుబాటు. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంగా సిపాయిల తిరుగుబాటును అభివర్ణించారు. వారసులులేని రాజ్యాలను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకోవచ్చని డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం, సైన్యంలో భారతీయ సిపాయిలకు కనీస సౌకర్యాలు, గౌరవం ఇవ్వకపోవడం వంటి పరిణామాలతో సిపాయిలు బ్రిటిష్ పాలకులపై తిరగబడ్డారు. 1857 మార్చి 29న సిపాయిలు బారక్‌పూర్‌లో.. కొత్తరకం తూటాలు వాడేందుకు నిరాకరించారు. మార్చి 29న మంగళ్‌పాండే అనే సిపాయి ఐరోపా అధికారి లెఫ్టెనెంట్ బాగ్‌ను కాల్చి చంపగా ఆయన్ని ఉరితీశారు. 1857 ఫిబ్రవరి 26న బరహంపూర్ శిబిరంలోని 19వ పదాతి దళ సిపాయిలు కవాతులో పాల్గొనడానికి నిరాకరించగా.. వారిని ఉద్యోగం నుంచి తొలగించారు. 47వ పదాతి దళ సిపాయిలు సముద్రం దాటడానికి నిరాకరిస్తే వారిని బ్రిటిష్‌వారు కాల్చిచంపారు. ఐతే సిపాయిల తిరుగుబాటు కొన్ని ప్రాంతాలకే.. పరిమితం కావడంతో బ్రిటిష్‌వారు ఎక్కడికక్కడే అణచివేయగలిగారు. భారతీయరాజులు తెల్లదొరలకు సహకరించడంతో 1857లో సిపాయిల తిరుగుబాటు విఫలమైంది. సిపాయిల తిరుగుబాటు ఫలితంగా 1858 నవంబరు 1నుంచి భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పాలన రద్దై, బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష పాలన అమలైంది. 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం.. విభజించి, పాలించు కుట్రను పూర్తిగా అమలు చేసిన ఆంగ్లేయులు దేశం మొత్తాన్ని తమ వశం చేసుకున్నారు. అయితే ఆంగ్లేయులు ఊహించినట్లు ఉద్యమం అంతటితో ఆగిపోలేదు.
దేశ భక్తిని అణువణువునా నింపుకున్న భారతీయులు.. పూర్తిస్థాయిలో ప్రతిఘటించేందుకు సిపాయిల తిరుగుబాటు బాటలుపరిచింది.
భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ ఏర్పాటు..
దేశ స్వాతంత్రోద్యమంలో.. మరో కీలకఘట్టం 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు. పదవీ విరమణ పొందిన ఆంగ్లేయ ఉద్యోగి ఎ.ఒ. హ్యూమ్ 1885లో భారత జాతీయ యూనియన్ అనే సంస్థను ఏర్పాటు చేయగా దాదాబాయి నౌరోజీ సూచన మేరకు భారత జాతీయ కాంగ్రెస్‌గా మార్చారు. 1915లో గాంధీజీ వచ్చే వరకూ బ్రిటిష్ సర్కార్‌కు కాంగ్రెస్ విధేయతనే ప్రదర్శించడం వల్ల స్వాతంత్రోద్యమం వేగం పుంజుకోలేదు. అయితే బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలాలజపతి రాయ్ వంటి వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గళమెత్తగా.. వారి ప్రభావంతో దేశ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్ష పెరిగింది. 19 వ శతాబ్దం చివరి నాటికి కాంగ్రెస్ డిమాండ్లలో, పోరాట విధానాల్లో మార్పు రావడం తెల్లదొరలకు కంటగింపుగా మారింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టేందుకు హిందూ -ముస్లింల మధ్య ఆంగ్లేయులు విభేదాలు సృష్టించగా 1906లో ముస్లిం లీగ్ ఏర్పాటుకు దారితీసింది. భారతీయులకు కపట హామీలిచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం.. మొదటి ప్రపంచ యుద్ధంలో వారు పాల్గొనేలా ఒప్పించింది. ఆ తర్వాత దేశ స్వాతంత్య్ర భావనలు ప్రజల్లో మరింత బలంగా నాటుకున్నాయి.
మహాత్ముని రాకతో..
1915లో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన గాంధీజీ కాంగ్రెస్‌లో చేరడంతో ఉద్యమం కీలక మలుపుతిరిగింది. 1920లో కాంగ్రెస్‌కు నాయకత్వం వహించిన గాంధీజీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమ బావుటా ఎగరేశారు. ముస్లిం లీగ్‌ను కూడా కలుపుకుని పోరాటం ఉద్ధృతం చేశారు. మొత్తం స్వాతంత్రోద్యమంలో కీలక పరిణామం 1919లో జలియన్‌వాలా బాగ్ మారణహోమం. 1919 ఏప్రిల్ 13న నాటి బ్రిటిష్ బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ జలియన్ వాలాబాగ్‌లో శాంతియుతంగా సమావేశమైన ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపించారు. అనాటి ఘోర మారణహోమంలో అమాయకులైన మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోగా భారతీయుల ఆర్తనాదాలు ఆక్రోశంగా మారాయి. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా.. పిడికిలెత్తేలా చేశాయి. జలియన్‌వాలాబాగ్ ఘటన తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం వెల్లువెత్తింది. బ్రిటిష్ ఉత్పత్తులను కొనేందుకు భారతీయులు నిరాకరించడంతో.. పాలకుల్లో కలవరం అంతకంతకూ పెరుగుతూ పోయింది.