దశాబ్దాల నాటి కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలన్న సంకల్పం ఓ పార్టీది. ప్రత్యర్థుల ఎత్తుగడలను, ప్రజావ్యతిరేకతను ఎదుర్కొని... మూడోసారి అధికార పీఠంపై కొనసాగాలన్న ఆరాటం మరో పార్టీది. ఇలా హోరాహోరీగా సాగుతున్న 'బంగాల్ దంగల్'లో 'నందిగ్రామ్' మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఒకే పార్టీలో సన్నిహితులుగా ఉన్నవారే ప్రత్యర్థులుగా మారడం, మెజార్టీల విషయంలో సవాళ్లు, ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న ప్రతిజ్ఞలు... మమతా బెనర్జీ-సువేందు అధికారి మధ్య పోరును రసవత్తరంగా మార్చాయి. మరి ఈ దిగ్గజాల పోరులో ఇతర చిన్న పార్టీల పరిస్థితేంటి? నందిగ్రామ్‌లో పోటీ చేస్తున్న స్వతంత్రుల అసలు లక్ష్యమేంటి? విజయావకాశాలు ఏమాత్రం లేవని తెలిసినా... బరిలో దిగడానికి కారణమేంటి?
నాన్న ప్రతిష్ఠ కోసం..
నందిగ్రామ్ బరిలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు షేక్ సద్దాం హుస్సేన్ బరిలోకి దిగుతున్నారు. ఆయన తండ్రి మహ్మద్ ఇలియాస్.. గతంలో ఇదే నియోజకవర్గంలో రెండుసార్లు సీపీఐ తరఫున గెలుపొందారు. 2007లో ఒక టీవీ ఛానల్ నిర్వహించిన శూలశోధన ఆపరేషన్‌లో ముడుపులు తీసుకుంటూ ఇలియాస్ దొరికిపోయారు. ఫలితంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే తన తండ్రిని ఈ కేసులో ఇరికించారని సద్దాం హుస్సేన్ వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే సద్దాం కొద్దిరోజుల క్రితం సీపీఐని వీడి.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.
మహాకూటమి నుంచి 'ఆమె'
మహా కూటమి(వామపక్షం-కాంగ్రెస్-ఐఎస్ఫ్) తరఫున సీపీఎం నేత మీనాక్షి ముఖర్జీ బరిలోకి దిగారు. 1960 నుంచి నందిగ్రామ్ వామపక్షాలకు కంచుకోటగా ఉంది. సీపీఐ దిగ్గజ నేత భూపాల్ చంద్ర పాండ.. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేవారు. కానీ ఈ స్థానాన్ని సీపీఎంకు ఇవ్వాలని సీపీఐ నిర్ణయించింది.
ఇదీ చదవండి :మహాకూటమి నందిగ్రామ్ అభ్యర్థిగా మీనాక్షీ ముఖర్జీ
పాపులారిటీ కోసం..
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న 44 ఏళ్ల దిలీప్ కుమార్ గయేన్.. ఇలాంటి చారిత్రక నందిగ్రామ్ సమరంలో తనకంటూ ఏదైనా గుర్తింపు వస్తుందన్న ఉద్దేశంతోనే బరిలోకి దిగుతున్నట్లు చెబుతున్నారు. నామినేషన్ దాఖలు చేయటం తప్ప.. ఎన్నికల ప్రచారం చేసే ఆసక్తి లేదని అంటున్నారు.
ఇదీ చదవండి :'సువేందు నామినేషన్ రద్దు చేయండి'
చెప్పను బ్రదర్...
62 ఏళ్ల సుబ్రతా బోస్ సైతం.. నందిగ్రామ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాను భారత పౌరుడ్ని.. తనకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని అంటున్నారు. దీనిపై ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి :'మమతా బెనర్జీ నామినేషన్ తిరస్కరించండి'