Independence Day 2022: స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. 76వ స్వాతంత్య్ర దినోత్సవానికి దిల్లీలోని ఎర్రకోట అంగరంగ వైభవంగా ముస్తాబైంది. చారిత్రక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 9వసారి జాతీయజెండా ఎగురవేయనున్నారు. ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలు మరింత ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం అనేక కార్యక్రమాలు నిర్వహించింది. ప్రపంచ దేశాల మాదిరిగానే భారత్ కూడా కరోనా కోరల నుంచి ఇప్పుడిప్పుడు బయటపడుతున్న వేళ జరుగుతున్న స్వాతంత్ర్య వజ్రోత్సవాలను కేంద్రప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది.
76వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా వంటి అనేక కార్యక్రమాలను కేంద్రం నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం పిలుపునకు ఆసేతు హిమాచలం స్పందించింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నివర్గాల ప్రజలు మువ్వన్నెల జెండా చేతబూని ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించి మేరా భారత్ మహాన్ అంటూ దేశభక్తిని చాటారు. ప్రతి ఏటా ప్రధాని మోదీ పంద్రాగస్టు ప్రసంగంలో అనేక కీలక అంశాలను హైలైట్ చేస్తుంటారు. దేశాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వివిధ వర్గాల కోసం చేపట్టిన కార్యక్రమాలను, త్వరలో చేపట్టబోయే పనులను ప్రస్తావిస్తుంటారు.
గతేడాది చేసిన పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ.. ప్రధానంగా జాతీయ హైడ్రోజన్ మిషన్, గతిశక్తి మాస్టర్ ప్లాన్, 75 వారాల్లో 75 వందే భారత్ రైళ్ల ప్రారంభం వంటి అంశాలను ప్రస్తావించారు. ఈసారి 100 ఏళ్ల స్వాతంత్య్ర భారత లక్ష్యాలు, ఆత్మ నిర్భర భారత్, దేశాభివృద్ధి, రక్షణ, ఆరోగ్యం, వ్యవసాయం, రైల్వేలు, ఇంధనం, క్రీడలు, సంక్షేమ పథకాలు, నూతన ఆవిష్కరణలు వంటి కీలక అంశాలను ప్రస్తావించే అవకాశముంది.