చిన్న వయసు నుంచే పిల్లల్లో పుస్తక పఠనం అలవాటును పెంపొందిస్తే.. వారిలో నైపుణ్యం, వ్యక్తిత్వ పునాదులు బలంగా ఉంటాయన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. చిన్నారుల్లో పఠనాశక్తిని పెంచేందుకు విద్యావేత్తలు, నిపుణులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిల్లల్లో వ్యక్తిత్వ వికాసంలో పుస్తక పఠనం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
ఒడిశా కటక్‌లో.. ఒడియా ఆదికవి సరలా దాస్ 600వ జన్మదిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు వెంకయ్య.
" పిల్లల్లో వ్యక్తిత్వం అభివృద్ధి చేసేందుకు.. గ్యాడ్జెట్ల అధిక వినియోగం నుంచి దూరంగా ఉంచటం అత్యవసరం. ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు మాతృభాషను వినియోగించటం అవసరం. విద్యార్థుల్లో పునాదులను బలంగా నిర్మించేందుకు ఉపాధ్యాయులు మాతృభాషలో రాయటం, చదవటాన్ని ప్రోత్సహించాలి. చిన్నారుల కోసం రచయితలు ఎక్కువ పుస్తకాలు రాయాలి. ఆ పుస్తకాలు పిల్లల అభిరుచులు, సామర్థ్యాలను పెంపొందించేవిగా ఉండాలి. ప్రాథమిక పాఠశాల వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. చిన్నతనంలో మాతృభాషలో చదువుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పటికే పలు పరిశోధనలు వెల్లడించాయి. పరిపాలనతో పాటు న్యాయవిభాగం కూడా స్థానిక భాషను వినియోగించాలి."