తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అభివృద్ధికి ఆటంకంగా జనాభా పెరుగుదల' - యోగి ఆదిత్యనాథ్

జనాభాను అరికట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. అభివృద్ధికి.. జనాభా పెరుగుదల ఆటంకంగా మారిందని చెప్పారు.

up population control
యూపీ జనాభా నియంత్రణ

By

Published : Jul 11, 2021, 4:59 PM IST

జనాభా పెరుగుదల.. అభివృద్ధికి ఆటంకంగా మారిందని ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు మరిన్ని చర్యలు అవసరమని చెప్పారు.

ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించి నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. గత నాలుగు దశాబ్దాలుగా ఈ సమస్యపైనే చర్చలు జరుగుతున్నాయని అన్నారు. 2021-30 దశాబ్దానికి సంబంధించిన ఉత్తర్​ప్రదేశ్ జనాభా విధానాన్ని ఈ కార్యక్రమంలోనే ఆవిష్కరించారు.

"అభివృద్ధికి.. జనాభా పెరుగుదల ఆటంకంగా మారుతుందని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. నాలుగు దశాబ్దాలుగా ఈ సమస్యపై చర్చలు జరుగుతున్నాయి. సమాజంలో అసమానతలతో పాటు ప్రజలు ఎదుర్కొనే ఎన్నో ప్రధాన సమస్యలకు జనాభా పెరుగుదలే కారణం. జనాభా కట్టడి దిశగా చర్యలు తీసుకున్న దేశాలు, రాష్ట్రాలు సానుకూల ఫలితాలను రాబట్టాయి. కానీ ఇంకా మరిన్ని చర్యలు అవసరం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని యూపీ ప్రభుత్వం ఈ జనాభా విధానాన్ని అమలు చేస్తోంది."

-యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి

2026 నాటికి యూపీలో జనన రేటును ప్రతి వెయ్యి జనాభాకు 2.1శాతానికి తగ్గించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు యోగి వెల్లడించారు. ప్రస్తుతం 2.7శాతంగా ఉన్న జనన రేటును 2030 నాటికి 1.9శాతానికి తగ్గించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

జనాభా పెరుగుదల విపరీతమవడం వల్ల రాష్ట్రంతో పాటు దేశాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని యోగి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పేదరికం పెరగడానికి జనాభా వృద్ధి కారణమవుతుందన్న ఆయన.. నూతన జనాభా విధానం కోసం 2018 నుంచి తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని గుర్తుచేశారు.

ఇప్పటికే చర్యలు

దేశంలోనే అత్యధిక జనాభా గల రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌.. జనాభా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇద్దరు పిల్లల నిబంధనను తీసుకురానుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర లా కమిషన్‌.. ముసాయిదా యూపీ జనాభా బిల్లు-2021ను(population control bill in up) తయారుచేసింది. ఇది చట్ట రూపంలోకి వస్తే ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు. అంతేకాదు.. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికీ అర్హత ఉండదు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి భవిష్యత్తులో ఎలాంటి పదోన్నతులు లభించవు. ప్రభుత్వం నుంచి పథకాలు పొందడానికి వీల్లేదు.

పాటిస్తే ప్రోత్సాహకాలు

ఇక ఇద్దరు పిల్లల నిబంధన పాటించే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ప్రోత్సాహకాలు అందజేయనున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. రేషన్‌ కార్డులో నలుగురే ఉండేలా ప్రతిపాదన చేశారు. ఈ ముసాయిదా బిల్లును రాష్ట్ర లా కమిషన్‌ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దీనిపై ప్రజల నుంచి సూచనలను జులై 19వరకు స్వీకరిస్తారు. ఆగస్టు రెండోవారంలో ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details