చైనా కయ్యానికి కాలు దువ్వితే భారత సైన్యం చూస్తూ కూర్చోదని.. ఇందుకు ధీటుగా సమాధానం చెప్పేందుకు సన్నాధంగా ఉందని ఈస్ట్రన్ ఆర్మీ కమాండ్ స్పష్టం చేసింది. భారత్ ఎప్పుడూ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ.. చైనాతో శాంతి, సామరస్య పూర్వక వాతావరణం కొనసాగించేందుకే ప్రయత్నిస్తుందని పేర్కొంది. గత కొంత కాలంగా సరిహద్దుల్లో (India China Border News) రెండు దేశాల సైనిక కదలికలు పెరిగాయని ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్ మనోజ్ పాండే తెలిపారు. అన్ని రకాల వాతావరణంలో పని చేసే.. ఆల్ టెరైన్ వాహనాలు, గైడెడ్ ఆయుధాలు, బెటర్ రాడార్లు, నైట్విజన్ కెమెరాలను సిద్ధం చేసినట్లు పాండే పేర్కొన్నారు. సరిహద్దుల వద్ద బలగాల మోహరింపు (India China Border Dispute) ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు. రెండు దేశాలు వాస్తవాధీన రేఖ సమీపం వరకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాయన్నారు. వాస్తవాధీన రేఖ వెంట బలగాల మోహరింపు కంటే.. నిఘా పెంపుదలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలిపారు.
ఈస్ట్రన్ కమాండ్ ప్రాంతంలో డిఫెన్స్ టెక్నాలజీ అన్ని విషయాల్లో అమల్లో ఉందని, నిఘా కోసం రాడార్లు, లాంగ్ రేంజ్ డ్రోన్లు, సీసీ కెమెరాలు, సెన్సార్లు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా వచ్చే సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు మనోజ్ పాండే చెప్పారు. వాస్తవాధీన రేఖకు సమీపంలోని సున్నిత ప్రాంతాల్లో చేపట్టే నిర్మాణల విషయంలో (India China Border Dispute) ఎప్పటికప్పుడు మనం అభ్యంతరాలు వ్యక్త పరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు, రూపొందించిన నియమావాళికి అనుగుణంగానే భారత్ వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.