ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలన్నా, పేద విద్యార్థులు ప్రభుత్వ సాయంతో ఉన్నత చదువులకు వెళ్లాలన్నా ఆదాయ ధ్రువీకరణ పత్రం చాలా ముఖ్యం. కుటుంబ ఆదాయం తక్కువగా ఉన్నవారికి ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా సాయం అందిస్తుంది. అయితే.. ఒక్కోసారి అధికారులు చేసే పొరపాట్లు కొందరిని ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అలాంటి సంఘటనే హరియాణా, జింద్ జిల్లాలో జరిగింది. రోజువారీ కూలీ పనులు చేసుకునే ఓ వ్యక్తి పిల్లల ఆదాయం ఏకంగా కోట్ల రూపాయలు ఉన్నట్లుగా వారి ధ్రువపత్రాల్లో ఉంది. అదే వారి పైచదువులకు ఆటంకంగా మారింది.
ఇదీ జరిగింది:జింద్ జిల్లా రామరాయ్ గ్రామానికి చెందిన భీమ్ సింగ్ రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతడికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. భీమ్ సింగ్ కొడుకు 81 శాతం మార్కులతో 12వ తరగతి పూర్తి చేసుకుని పై చదువులకు వెళ్లాలనుకుంటున్నా ఎక్కడా అడ్మిషన్ దొరకటం లేదు. మరోవైపు.. అతడి కూతురు సోనియా జియోగ్రఫీలో ఎంఎస్సీ, ఎన్ఈటీలో ఉత్తీర్ణత సాధించినా.. సాక్షమ్ యోజనలో దరఖాస్తు చేసుకోలేకపోయింది. అందుకు కారణం వారి ఆదాయ ధ్రువపత్రాలే. తాను బీఈడీ చేయాలనుకుంటున్నానని, తన కుటుంబ గుర్తింపు కార్డు కారణంగా అడ్మిషన్ దొరకటం లేదని ఆందోళన వ్యక్తం చేసింది సోనియా.
కుటుంబ గుర్తింపు కార్డులో భీమ్ సింగ్ కుమారుడి ఆదాయం రూ.500 కోట్లుగా, కూతురు సోనియా ఆదాయం రూ.కోటిగా పేర్కొన్నారు అధికారులు. అయితే.. కూలీ పనులు చేసే భీమ్ సింగ్ ఆదాయం రూ.36వేలు మాత్రమే ఉండటం గమనార్హం. ఈ ధ్రువపత్రాన్ని సవరించేందుకు గత 4-5 నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అలిసిపోయింది భీమ్ సింగ్ కుటుంబం.