ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ చిగురుటాకులా వణుకుతోంది. రాష్ట్రంలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా.. వరద ఉద్ధృతికి వంతెనలు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
భారీ వర్షాలకు మంగళవారం ఒక్కరోజే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 16కి చేరింది. వరద బాధితులకు సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.
నైనితాల్ జిల్లాలో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. నైనితాల్ సరస్సులో నీరు ప్రమాదకరస్థాయికి చేరుకుంది. సరస్సు పొంగిపొర్లడం వల్ల ఆ ప్రాంతంలోని రోడ్లు జలమయం అయ్యాయి. మరోవైపు హల్ద్వానీలోని గౌలా నది ఉద్ధృతికి అక్కడి వంతెనలో కొంత భాగం కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. వరద ఉద్ధృతి తగ్గాకే వంతెన మరమ్మతు పనులు చేపడతామని స్పష్టం చేశారు.
చమోలీ, బద్రీనాథ్ల్లో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాల ధాటికి రోడ్లు అస్తవ్యస్తం అయ్యాయి. బద్రినాథ్లోని ఓ ఘాట్ రోడ్డులో కారులో ప్రయాణిస్తున్న పలువురు వరదల్లో చిక్కుకున్నారు. అప్రమత్తమైన అధికారులు యంత్రాల సాయంతో కారును ఒడ్డుకు లాగారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.