తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రామోజీ ఫౌండేషన్‌ చేయూతతో ఇబ్రహీంపట్నం ఆర్టీవో నూతన కార్యాలయం ప్రారంభం - మన్నెగూడ ఆర్టీవో కార్యాలయం ప్రారంభం

Inauguration of Manneguda RTO Office : రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయం శాశ్వత భవనంలోకి మారింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మన్నెగూడలో పదేళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతున్న ఆ కార్యాలయానికి రామోజీ ఫౌండేషన్ చేయూతగా నిలిచింది. తన వంతు సామాజిక బాధ్యతగా 2 కోట్ల 15 లక్షల రూపాయలతో అత్యాధునిక వసతులతో నూతన భవనాన్ని నిర్మించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మన్నెగూడ ఆర్టీఏ కార్యాలయ నూతన భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

Ramoji Founadation Trust
Inauguration of Manneguda RTO Office

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 8:19 PM IST

Updated : Jan 18, 2024, 9:33 PM IST

మన్నెగూడలో ఆర్టీవో నూతన కార్యాలయం ప్రారంభం రామోజీ ఫౌండేషన్‌ చేయూత

Inauguration of Manneguda RTO Office : రంగారెడ్డి జిల్లాలో రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయాలకు శాశ్వత భవనాలు సమకూరాయి. ఇన్నాళ్లు అద్దె భవనాలు, అరకొర వసతుల మధ్య కొనసాగిన ఆ కార్యాలయాలు ఇక నుంచి శాశ్వత భవనాల్లో ప్రజలకు సేవలందించబోతున్నాయి. ఇందుకు నిదర్శనమే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మన్నెగూడలోని రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయం. 2014లో ప్రభుత్వం ఆర్టీఏ కార్యాలయానికి 6 ఎకరాలు కేటాయించింది. అప్పటి నుంచి శాశ్వత భవన నిర్మాణానికి నోచుకోలేదు.

Harish Rao Praises Ramoji Rao : 'విపత్తు సమయాల్లో ప్రజలను ఆదుకోవడంలో రామోజీ ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుంది'

ఈ క్రమంలో రామోజీ ఫౌండేషన్(Ramoji Foundation) సామాజిక బాధ్యతగా మన్నెగూడ ఆర్టీఏ కార్యాలయానికి 2 కోట్ల 15 లక్షలు వెచ్చించి నూతన భవనం నిర్మించింది. 5 వేల 600 చదరపు గజాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో సిద్ధం చేసిన ప్రాంతీయ కార్యాలయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, జిల్లా కలెక్టర్ శశాంక, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్దప్రసాద్, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ అనిత రెడ్డి, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ఆర్టీవో రఘునందన్ గౌడ్ సహా స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Ramoji Foundation Trust :ఆర్టీవో రఘునందన్ గౌడ్ ఛాంబర్‌ని ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి ప్రారంభించారు. ఆర్టీవోను కుర్చీలో కూర్చోబెట్టి మంత్రి పొన్నం, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి శాలువాతో సత్కరించారు. రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయానికి భవనాన్ని నిర్మించి ఇచ్చిన రామోజీ ఫౌండేషన్‌ ప్రతినిధులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి పౌరుడితో నేరుగా సంబంధం ఉన్న రవాణా శాఖలో త్వరలోనే మరిన్ని సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలిపారు.

రామోజీ ఫౌండేషన్‌ దాతృత్వం.. రూ.కోటీ 50 లక్షలతో వృద్ధాశ్రమం

దళారీ వ్యవస్థ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్లను మరింత సులభతరం చేయనున్నట్లు పొన్నం వెల్లడించారు. రహదారి భద్రతకు సంబంధించిన పోస్టర్, బ్రోచర్లను మంత్రి ఆవిష్కరించారు. జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 11 మండలాల పరిధిలోని ప్రజలకు మన్నెగూడ రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయం సేవలందించనుంది. ఇందుకోసం రామోజీ ఫౌండేషన్ రవాణా శాఖ కార్యాలయంలో లేని వసతులను సమకూర్చింది.

ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్, జనరేటర్, సీసీ కెమెరాలు, ఇంటర్నెట్ సౌకర్యం, యూపీఎస్‌ సిస్టమ్, రికార్డ్స్ ర్యాక్స్, ఏసీలతో పాటు ప్రజలు వేచి చూసేందుకు హాలు నిర్మించింది. సందర్శకుల ఆహ్లాదం కోసం లాన్‌ ఏర్పాటు చేసింది. తొమ్మిది నెలల్లోనే భవన నిర్మాణాన్ని పూర్తిచేసి ఆ శాఖ అధికారులకు అప్పగించింది. రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి 28 లక్షలతో కంప్యూటర్లు, సిగ్నెచర్ ప్యాడ్లు సిబ్బందికి అందజేశారు. మన్నెగూడలో సకల వసతులతో ఆర్టీఏకార్యాలయాన్ని నిర్మించిన రామోజీ ఫౌండేషన్‌ సేవలను వక్తలు కొనియాడారు.

"రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయానికి భవనాన్ని నిర్మించి ఇచ్చిన రామోజీ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు. ప్రతి పౌరుడితో నేరుగా సంబంధం ఉన్న రవాణా శాఖలో త్వరలోనే మరిన్ని సంస్కరణలు తీసుకురానున్నాము. దళారీ వ్యవస్థ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్లను మరింత సులభతరం చేస్తాము". - పొన్నం ప్రభాకర్‌, మంత్రి

ఈ ప్రపంచం ఆత్మవిశ్వాసం కలిగిన వారిది - అభద్రతా భావాన్ని దరి చేరనివ్వొద్దు : ఈనాడు ఎండీ కిరణ్

Last Updated : Jan 18, 2024, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details