అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడం, ప్రస్తుతం జరుగుతున్న జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నికలతో ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా చిన్న పార్టీలు ఏర్పాటవుతుండడం, ఇప్పటికే ఉన్న చిన్న పార్టీలు ఏకమవుతుండడం కీలక పరిణామం. దాంతో ఇవి ఏ ప్రధాన పార్టీ ఓటు బ్యాంకుకు నష్టం కలిగిస్తాయోనన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఆ పార్టీలకు ఇవి కలవరం కలిగిస్తున్నాయి. ఈ వారంలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. ఎస్సీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ తన రాజకీయ పార్టీ 'ఆజాద్ సమాజ్ పార్టీ' కార్యాలయాన్ని ప్రారంభించారు. భాజపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఇది ఈ నెల 21వరకు కొనసాగనుంది. భావ సారూప్యతగల పార్టీలతో పొత్తుకు సిద్ధమేనని సంకేతాలిచ్చారు.
నిషాద్‌ల ఏకీకరణకు యత్నాలు
ఇంతవరకు బిహార్‌కు పరిమితమైన వికాస్ ఇన్సాన్ పార్టీ (విఐపి) కూడా రంగంలో ఉండనుంది. బాలీవుడ్ డిజైనర్‌గా పేరుపొందిన ముఖేశ్ సాహ్నీ దీని అధ్యక్షుడు. నిషాద్‌లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలన్నదే ఎన్నికల నినాదంగా ఉండనుంది. రాష్ట్రంలో 14 శాతం ఉన్న నిషాద్‌లను ఏకం చేయాలని ఆయన భావిస్తున్నారు. 75 వేల కన్నా ఎక్కువగా నిషాద్‌ల జనాభా ఉన్న నియోజకవర్గాలు 70 వరకు ఉన్నాయి. దాంతో ఏకంగా 150 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తున్నారు. ఆయన కూడా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
బందిపోటు రాణిగా పేరుపొందిన ఫూలన్‌దేవి ఒకప్పుడు నిషాద్‌లకు పెద్దదిక్కుగా ఉండేవారు. నిషాద్‌ల్లోని ఉపకులాలను ఏకం చేసి ఆమె సెంటిమెంట్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ నెల 25న ఆమె వర్ధంతి సందర్భంగా ప్రతి జిల్లాలోనూ 'ఫూలన్‌దేవి జ్ఞాపకాలు' పేరిట కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన కార్యక్రమాన్ని గోరఖ్‌పుర్‌లో నిర్వహిస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో నిషాద్‌ల నాయకునిగా డాక్టర్ సంజయ్ నిషాద్ గుర్తింపు పొందారు. సాహ్నీ రాకతో ఇద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామం ఏ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతున్నదన్నది చర్చనీయాంశమైంది. ఇంతవరకు నిషాద్‌ల మద్దతు అన్ని పార్టీలకూ లభిస్తుండడం గమనార్హం.