దేశంలోని హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. కొలీజియంలో ఉన్న ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు.. హైకోర్టు న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేసినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కొలీజియం తరపున విడుదల చేసిన ప్రకటనలో సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, తొలిసారి కొలీజియంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన న్యాయమూర్తుల పేర్లను వెల్లడించడం చర్చకు దారితీసింది. న్యాయమూర్తుల నియామకానికి అనుసరించిన పద్ధతే అభ్యంతరాలకు కారణంగా తెలుస్తోంది. ఈ మేరకు అక్టోబర్ 9న కీలక ప్రకటనను విడుదల చేసింది. కొలీజియం సమావేశానికి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ హాజరు కాలేదు. దీంతో సభ్యులు అభిప్రాయాలు సేకరించేందుకు తొలిసారిగా ఉపయోగించిన సర్కులేషన్ పద్ధతిని ఇద్దరు న్యాయమూర్తులు వ్యతిరేకించారని తెలిపింది.
సాధారణంగా న్యాయమూర్తులు నియామకానికి కొలీజియం భౌతికంగా సమావేశం అవుతుంది. కానీ సెప్టెంబర్ 30న జరిగిన సమావేశానికి ఇద్దరు న్యాయమూర్తులు భౌతికంగా హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ సర్కులేషన్ పద్ధతిని అనుసరించారు. ఇది తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీంతో కొలీజియంలోని సభ్యులు న్యాయమూర్తులు నియామక ప్రక్రియకు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం వెనక జరిగిన పరిణామాలపై కొలీజీయం ప్రకటనను విడుదల చేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని కొలీజియంలో జస్టిస్ డీవై చంద్రచూడ్, సంజయ్ కిషన్ కౌల్, ఎస్ అబ్దుల్ నజీర్, కేఎం జోసెఫ్ సభ్యులుగా ఉన్నారు. న్యాయమూర్తుల నియామకాల కోసం మొదట సెప్టెంబర్ 26న కొలీజియం సమావేశమైంది. ఈ క్రమంలోనే 11 మంది జడ్జిల పేర్లు పరిశీలించగా.. అందులో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్తాపై ఏకాభిప్రాయం వచ్చింది. మిగిలిన వారిపై చర్చించేందుకు సెప్టెంబర్ 30న మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 30న జరిగిన సమావేశానికి జస్టిస్ డీవై చంద్రచూడ్ హాజరు కాలేదు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ సర్కులేషన్ పద్ధతిలో కొలీజియంలో ఉన్న సభ్యులకు లేఖ రాశారు. దీనిపై జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ వేర్వేరు లేఖల్లో తమ అభ్యంతరాలను తెలిపారు. సాధారణంగా అభ్యంతరాలు వ్యక్తం చేసిన న్యాయమూర్తుల పేర్లను వెల్లడించరు. కానీ, ఈసారి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్లను కొలీజియం ప్రకటించడం గమనార్హం.