సెలవురోజు సరదాగా గడుపుదామని వచ్చిన వారి ప్రాణాలు నీళ్లలో కలిసిపోయాయి. గుజరాత్లో బ్రిటిష్ కాలంనాటి వంతెన కూలి.. 135 మంది మృత్యువాత పడ్డారు. వందల మంది గాయాలపాలయ్యారు. ఎన్నో కుటుంబాలకు తీరని దుఃఖం మిగిల్చింది ఈ మోర్బీ దుర్ఘటన. అందులో హర్షి అనే ఏడేళ్ల బాలిక చావుకు ఎదురెళ్లి ప్రాణాలు కాపాడుకుంది. కానీ తన తల్లిదండ్రులను కోల్పోయి అనాథయ్యింది.
ఆదివారం కావడం వల్ల ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి మోర్బీ వంతెన వద్దకు భారీగా పర్యాటకులు వచ్చారు. దీంతో వంతెనపై సందడి వాతావరణం నెలకొంది. అందరూ ప్రకృతి సోయగానికి మంత్రముగ్ధులు అయిపోతున్నారు. ఇంతలో ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. వంతెనపై వందల మంది నదిలో పడిపోయారు. ఆర్తనాదాలు, హాహాకారాలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. అనేక కుటుంబాలు కకావికలం అయ్యాయి.
అయితే.. ఇంతటి పెను విపత్తులోనూ మృత్యువును జయించింది అహ్మదాబాద్‌కు చెందిన హర్షి అనే ఏడేళ్ల బాలిక. ఒక్కొక్కరి ప్రాణాలను నది మింగేస్తున్న వేళ.. తెగిపడిన వంతెన తాడును గట్టిగా పట్టుకుంది చిన్నారి. ఒంట్లో ఒక్కొక్క అణువును ఏకం చేసుకొని మృత్యువుకే ముచ్చెమటలు పట్టించింది. చావును జయించింది. కానీ అదే ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయింది. అమ్మనాన్న ఎక్కడ అని అమాయకంగా అడుగుతున్న హర్షి పరిస్థితి.. అందరి హృదయాలను కలచివేస్తోంది.