కేరళలో ధర్మదాం నియోజకవర్గ పోరు రసవత్తరంగా మారింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవాలని సీఎం పినరయి విజయన్ వ్యూహాలు రచిస్తున్నారు. 2016లో ధర్మదాం నియోజక వర్గం నుంచి విజయం సాధించిన ఆయన.. ఈ ఎన్నికల్లోనూ అక్కడ నుంచే సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. 2017లో సంచలనం సృష్టించిన వలయార్ అక్కాచెల్లెళ్ల హత్యాచారం కేసులో మృతుల తల్లి.. ధర్మదాంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
తన కుటుంబానికి అన్యాయం జరిగినపుడు సీఎం ఒక్కమాట కూడా మాట్లాడ లేదన్న మృతురాళ్ల తల్లి.. ఆయనకు వ్యతిరేకంగా గళమెత్తేందుకు ఇదే సరైన అవకాశంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తన కుమార్తెలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని.. సంఘ్ పరివార్ మినహా అందరి మద్దతూ తీసుకుంటానని చెప్పారు.
యూడీఎఫ్‌తో చర్చించాక..
ధర్మదాం నియోజక వర్గానికి విపక్ష యూడీఎఫ్ కూటమి ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆమె నిర్ణయం సరైందేనని కేపీసీసీ అధ్యక్షుడు ముళ్లంపల్లి రామచంద్రన్ అన్నారు. యూడీఎఫ్‌తో చర్చించి ఆ నియోజకవర్గంలో పోటీ చేయాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భాజపా తరఫున సీకే పద్మనాభన్ ఇక్కడ నుంచి నామినేషన్ దాఖలు చేశారు.