'నా ఇద్దరు కూతుళ్లకు తిండి పెట్టలేని దుస్థితి. అత్తమామాల మందులకు ఇబ్బంది అవుతోంది. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించేటప్పుడు కొన్నిసార్లు ఛీత్కారాలు ఎదురవుతాయి.' ఇదీ.. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ఓ టీచర్ ఆవేదన. ఉపాధ్యాయ వృత్తి నుంచి నగర మున్సిపల్ కార్పొరేషన్లో చెత్త బండి డ్రైవర్‌గా మారిన స్మృతి రేఖ బెహారా రోదన.
ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన స్మృతి రేఖ.. ఓ నర్సరీ ప్లే స్కూల్లో బోధించేవారు. భర్త, ఇద్దరు కూతుళ్లు, అత్తమామలతో నగరంలోని పాతబంద మురికివాడలో నివసించేవారు. అప్పటివరకు సాఫీగా సాగుతున్న వారి జీవితం.. కరోనా మహమ్మారితో తలకిందులైంది.
అక్షరాలు దిద్దించాల్సిన చేతులు..
కొవిడ్ కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఉన్న హోం ట్యూషన్లను.. కొవిడ్ నిబంధనల కారణంగా ఆపేయాల్సి వచ్చింది. నిస్సహాయకురాలిగా మారిన స్మృతి రేఖ.. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)లో చెత్తబండి డ్రైవర్ అవతారామెత్తక తప్పలేదు. దీంతో చిన్నారులతో అక్షరాలు దిద్దించాల్సిన ఆమె చేతులు.. పుర వీధుల్లో స్టీరింగ్ తిప్పుతున్నాయి.