చదువు మధ్యలోనే ఆపేసిన ఓ వ్యక్తి హెలికాప్టర్‌ను తయారుచేయాలని కలలుగన్నాడు. తీరా దానిని తయారుచేసి పరీక్షిస్తుండగా హెలికాప్టర్ రెక్కలు విరిగిపోయి, గొంతు కోసుకుపోయి అతడు మరణించాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్ర యావత్మాల్లో జరిగింది.
అలా మొదలు..
జిల్లాలోని మహాగావ్ తాలూకా ఫుల్సవంగికి చెందిన షేక్ ఇస్మాయిల్ షేక్ ఇబ్రహీం(24) ఎనిమిదో తరగతిలోనే స్కూలు మానేశాడు. తన సోదరునికి చెందిన గ్యాస్ వెల్డింగ్ వర్క్‌షాప్‌లో పనిచేయడం మొదలుపెట్టాడు. స్టీల్, అల్యూమినియంతో బీరువాలు, కూలర్లు, ఇతర గృహోపకరణాల తయారీలో ప్రావీణ్యం సంపాదించాడు. హెలికాప్టర్ తయారీపై ఉన్న ఆసక్తితో గత ఆ పనిలో నిమగ్నమయ్యాడు. రెండేళ్లుగా నిర్మించిన తన 'మున్నా హెలికాప్టర్'ను బుధవారం వేకువజామున.. ట్రయల్ రన్ చేపట్టాలని నిర్ణయించాడు. ఇంజిన్‌ను స్టార్ట్ చేయగానే హెలికాప్టర్ రోటర్ బ్లేడ్ విరిగిపోయి లోపల ఉన్న అతడిని ఢీకొట్టింది. దీనితో ఇస్మాయిల్ అక్కడికక్కడే మరణించాడు.
'హెలికాప్టర్ స్టార్ట్ అవ్వగానే అంతా ఆశ్చర్యపోయాం. అకస్మాతుగా బ్లేడ్ విరిగిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అంతలోనే విరిగిపోయిన బ్లేడ్ వల్ల ఇస్మాయిల్ గొంతు తెగిపోయింది' అని అతడి స్నేహితుడు తెలిపాడు.