మహారాష్ట్రలో లాక్‌డౌన్ తరహా జనతా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి మే ఒకటో తేదీ ఉదయం 7గంటల వరకు 15రోజులపాటు కర్ఫ్యూతరహా ఆంక్షలు అమల్లో ఉంటాయి. మహారాష్ట్రలో కొన్నిరోజులుగా కరోనా రోజువారీ కేసులు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతుండటంతో వైరస్ గొలుసును తెచ్చేందుకు మహాసర్కార్ కఠిన నిర్ణయం తీసుకుంది. ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడకూడకుండా 144 సెక్షన్ విధించారు.
15రోజులపాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ప్రార్థనాస్థలాలు, థియేటర్లు, పార్కులు, జిమ్‌లు మూసి వేయాలని పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. సరైన కారణం లేకుండా బహిరంగ ప్రదేశాలను సందర్శించటంపై ఆంక్షలు విధించారు. అత్యవసర విభాగంలోని సేవలు, కార్యకలాపాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. పనిదినాల్లో వారు ఉదయం 7గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ బయటికిరావచ్చు. భౌతికదూరం, మాస్క్‌లు తప్పనిసరిగా ధరించటంతోపాటు కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.
సొంతూళ్ల కు బాటపట్టిన కూలీలు
మహారాష్ట్రలో జనతాకర్ఫ్యూ పేరుతో విధించిన ఆంక్షలు వలసకూలీల పాలిట పిడుగుపాటులా మారాయి. అత్యవసరంమినహా అన్నిమూతపడటంతో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు సొంతూళ్ల బాటపట్టారు. వారి రాకతో ముంబయిలోని లోకమాన్య తిలక్ రైల్వే టెర్మినల్ రద్దీగా మారింది. తత్కాల్ సహా వివిధ రూపాల్లో టికెట్లు బుక్ చేసుకున్న వలస కార్మికులు రైళ్లలో బయలుదేరారు. జనతా కర్ఫ్యూ వల్ల పని దొరకకపోవటమే కాకుండా బయటకు రావడానికి ఉండదని వలస కార్మికులు తెలిపారు. అందుకే మూటముల్లే సర్దుకుని, భార్యాపిల్లలతో సొంతూళ్లకు వెళ్తున్నట్లు చెప్పారు.
అత్యవసర పరిస్థితులు, ప్రత్యేకసందర్భాల్లో ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చే అధికారం డివిజనల్ ఏసీపీలు, జోనల్ డీసీపీలు, ప్రాంతీయ అదనపు పోలీసు కమిషనర్లకు ఇచ్చారు. జనతా కర్ఫ్యూ ఆంక్షలను ఉల్లంఘించినవారిపై ఐపీసీ 188 సెక్షన్‌తోపాటు అంటువ్యాధుల చట్టం, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:మహారాష్ట్రలో కర్ఫ్యూ.. ఐపీఎల్ మ్యాచ్‌లు యథాతథం