మొబైల్ గేమ్ సరదా ఓ బాలుడి ప్రాణాలు తీసింది. తల్లిదండ్రులకు తెలియకుండా ఆన్‌లైన్‌లో గేమ్ ఆడి రూ.40 వేలు పోగొట్టడం వల్ల అమ్మ తిట్టిందని 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఇదీ జరిగింది..
ఛత్తర్‌పుర్‌కు చెందిన ఓ బాలుడు తన తల్లిదండ్రులకు తెలియకుండా వారి బ్యాంకు ఖాతాలోని సొమ్ముతో ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతుండేవాడు. అలా ఓ రోజు తన బ్యాంకు ఖాతా నుంచి రూ.1500 ఖర్చయినట్లు అతడి తల్లి మొబైల్‌కు సందేశం వచ్చింది. దీంతో ఆమె తన కుమారుడికి ఫోన్ చేసి ఆ ఖర్చుపై ప్రశ్నించింది. ఆ డబ్బును ఆన్‌లైన్‌లో గేమ్ ఆడేందుకు తానే వినియోగించినట్లు బాలుడు చెప్పగా, ఆమె కుమారుడిని మందలించింది. దాంతో మనస్తాపానికి గురైన ఆ బాలుడు తన గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.