సాంకేతిక యుగంలోనూ అశాస్త్రీయ సంప్రదాయాలను ఆచరిస్తున్నారు కొందరు. భార్యల హుందాతనాన్ని కాపాడాల్సింది పోయి రకరకాలుగా వేధిస్తున్నారు. కొత్తగా పెళ్లైన ఇద్దరు అక్కాచెల్లెళ్లలో ఒకరు కన్యత్వ పరీక్షలో విఫలమయ్యారని మహారాష్ట్ర కొల్హాపూర్‌కు చెందిన ఇద్దరు వధువులను ఇంటినుంచి వెళ్లగొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పరీక్షలో విఫలం-తెగదెంపులు..
కంజర్‌భట్ వర్గానికి చెందిన యువతులకు వివాహ అనంతరం కన్యత్వ పరీక్ష నిర్వహించే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఇదే వర్గానికి చెందిన ఇద్దరు యువతులు.. 2020 నవంబర్ 27న కర్ణాటక బెల్గాంకు చెందిన అన్నాదమ్ముళ్లను వివాహం చేసుకున్నారు. వివాహమైన మూడు రోజుల అనంతరం అత్తింటివారు నవవధువులకు కన్యత్వ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఒకరు విఫలమయ్యారు. అప్పటినుంచి వరుడి తల్లి ఆమెను పదేపదే వేధిస్తూ ఉండేది. ఆమెకు మర్యాద తెలియదని హింసిస్తూ ఉండేది. చివరకు ఇద్దరినీ పుట్టింటికి పంపించేశారు.
అంతటితో ఆగక 2021 ఫిబ్రవరి 28న.. స్థానిక రాజారాంపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆలయంలో కుల పంచాయతీ ఏర్పాటు చేశారు. తమ భర్తలతో, అత్తమామలతో యువతులకు ఎలాంటి సంబంధం లేదని తీర్పు చెప్పారు పెద్దలు. సర్పంచ్ ముందే ఈ వింత నిర్ణయం వెలువడటం గమనార్హం. దీంతో చేసేదిలేక పుట్టింటింకి చేరారు ఆ యువతులు.
ఆలస్యంగా వెలుగులోకి..
తమకు నిర్వహించిన కన్యత్వ పరీక్ష గురించి, కుల పంచాయతీ తీర్పు గురించి బాధిత యువతులు మహారాష్ట్ర మూఢవిశ్వాసాల నిర్మూలన సమితికి(ఏఎన్ఐఎస్) లేఖ రాశారు. తమకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పెళ్లి చేసుకుని అత్తింట్లో అడుగుపెట్టిన తమ పట్ల ఆ కుటుంబం అన్యాయంగా ప్రవర్తించిందని పేర్కొన్నారు.