బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభం నుంచే వాయిదాల పర్వం కొనసాగింది. సాగు చట్టాలపై విపక్ష సభ్యుల ఆందోళనలతో సభ అట్టుడికింది. అయితే.. లోక్సభ స్పీకర్ అభ్యర్థన మేరకు ఈ తీర్మానంపై చర్చించేందుకు గత మంగళవారం ఏకంగా రాత్రి 1 గంట వరకు సభలోనే ఉన్నారు సభ్యులు. ఈ క్రమంలో గడిచిన సోమ, మంగళవారాల్లో సభ సగటు పనికాలం ఏకంగా 150 శాతానికిపైగా నమోదైనట్లు లోక్సభ సచివాలయం వెల్లడించింది.
గత మంగళవారం సభను ముందుగా రాత్రి 12 గంటల వరకు పొడిగించారు. ఆ తర్వాత రాత్రి 1 గంటకు పెంచారు. దాంతో సభ పనికాలం సుమారు రెండింతలకు చేరింది.
ఫిబ్రవరి 8న సభ పనికాలం 142 శాతం, ఫిబ్రవరి 9న పనికాలం ఏకంగా 180 శాతంగా నమోదైంది. సోమ, మంగళవారాల్లో 69 మంది మాట్లాడగా, 62 మంది తమ ప్రసంగాలను సభ ముందుకు తీసుకొచ్చారు. సభలో ప్రతిఒక్కరికి సరిపడా సమయాన్ని స్పీకర్ కేటాయించారని సచివాలయం వెల్లడించింది.