దేశంలోని మహిళల్లో గర్భనిరోధకతపై అవగాహన పెరుగుతోంది. 13.9 కోట్ల మంది మహిళలు, యువతులు అధునాతన గర్భనిరోధక పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. మహిళా హక్కుల పరిరక్షణకు తోడ్పడే 'ఫ్యామిలీ ప్లానింగ్-2020' అనే అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థ ఈ అంశంపై నివేదిక విడుదల చేసింది. గత ఎనిమిదేళ్లుగా కుటుంబ నియంత్రణ విషయంలో సాధించిన పురోగతిని వివరించింది.
13 అల్పాదాయ దేశాల్లో అధునాతన గర్భనిరోధక పద్ధతులు ఉపయోగిస్తున్నవారి సంఖ్య 2012 తర్వాత రెట్టింపు అయింది. గడిచిన ఒక్క సంవత్సరమే 12.1 కోట్ల అవాంఛిత గర్భాలు, 2.1 కోట్ల సురక్షితం కాని గర్భస్రావాలు, లక్షా 25 వేల గర్భిణీ మరణాలు నివారణ అయినట్లు నివేదిక తెలిపింది. భారత్లో గర్భనిరోధక పద్ధతులు పాటించడం వల్ల 5.45 కోట్లకు పైగా అవాంఛిత ప్రెగ్నెన్సీలకు అడ్డుకట్టపడిందని వెల్లడించింది. గడిచిన ఒక్క సంవత్సరంలోనే 18 లక్షల సురక్షితం కాని అబార్షన్లు, 23 వేల గర్భిణీ మరణాలను నివారించగలిగినట్లు నివేదిక పేర్కొంది. 69 అల్పాదాయ దేశాల్లోని 32 కోట్ల మంది మహిళలు, యువతులకు కుటుంబ నియంత్రణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది.
"కుటుంబ నియంత్రణకు కట్టుబడి.. ఈ కార్యక్రమాలకు భారత ప్రభుత్వం అధిక వ్యయం చేస్తోంది. గణాంకాల ప్రకారం 54 దేశాలు కలిసి 160 కోట్లు ఖర్చు చేశాయి. భారత్, ఇండోనేసియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ దేశాలదే ఇందులో అధిక వాటా."