తల్లిదండ్రులు తమ మరణానంతరమే పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వాలి తప్ప, తాము జీవించి ఉండగా రాసిస్తే అష్టకష్టాలు తప్పవని పారిశ్రామికవేత్త, పైలట్ విజయ్ పత్ సింఘానియా పేర్కొన్నారు. రేమండ్ గ్రూపు సంస్థల మాజీ ఛైర్మన్ అయిన సింఘానియా తన ఆత్మ కథ 'ఏన్ ఇన్ కంప్లీట్ లైఫ్'లో ఈ మేరకు తన జీవితంలో చోటుచేసుకున్న ఎత్తుపల్లాలను పంచుకున్నారు. ఈ పుస్తకాన్ని పాన్ మాక్ మిలన్ సంస్థ ప్రచురించింది. 2015 ఫిబ్రవరిలో కుటుంబ సభ్యులతో వచ్చిన వివాదం వల్ల సింఘానియా వారసత్వ గృహాన్నీ, ఇతర ఆస్తిపాస్తులను కోల్పోయారు. వాటన్నింటినీ తిరిగి పొందడానికి పోరాడుతున్నారు. "మనం జీవించి ఉండగానే సంతానానికి ఆస్తి రాసివ్వకూడదని గుణపాఠం నేర్చుకున్నాను. మరణానంతరమే మన ఆస్తులు వారికి సంక్రమించాలి. నేను ఇప్పుడు అనుభవిస్తున్న నరకం మరే తల్లిదండ్రులూ అనుభవించకూడదనే ఈ సలహా ఇస్తున్నా" అని సింఘానియా స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయన సొంత కార్యాలయానికి వెళ్లలేకపోతున్నారు. కార్యాలయంలోని ముఖ్యమైన పత్రాలు, ఇతర సామగ్రినీ తెచ్చుకోలేకపోతున్నారు. 'ముంబయి, లండన్‌లలో ఉన్న కార్లూ నాకు కాకుండా పోయాయి. నన్ను కార్యాలయానికి రానివ్వడం లేదు. రేమండ్స్ ఉద్యోగులెవరూ నాతో మాట్లాడకూడదని నిషేధం విధించారు' అని సింఘానియా వాపోయారు.
నింగిలోకి రివ్వున దూసుకుపోతే..