కర్ణాటకలోని బెళగావీ జిల్లా సమ్వసుద్ధి గ్రామంలో కరోనా కారణంగా ఒక్క నెలలోనే 80మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గ్రామస్థులు వెల్లడించారు.
గ్రామస్థుల ఆగ్రహం..
తమ గ్రామ పరిస్థితి గురించి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 80మంది మృతి చెందారని.. మృతుల్లో గ్రామపంచాయతీ సభ్యులు కూడా ఉన్నారని తెలిపారు. అధికారులు మాత్రం ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు సమర్పిస్తున్నారని.. కేవలం 10మందే చనిపోయినట్టు నివేదికలో చూపిస్తున్నారని ఆరోపించారు.
గ్రామంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్నా ఆరోగ్య శాఖ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్థులు మండిపడ్డారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎమ్మెల్యే ఉన్నారో లేదో తెలియట్లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
టెస్టు చేయించుకోలేము..
గ్రామంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నా.. అవి ఉచితం కానందున తాము పరీక్షలు చేయించుకోలేదని స్థానికులు తెలిపారు. ఒకవేళ కరోనా సోకినట్లు తెలిస్తే అందుకు అయ్యే ఆసుపత్రి ఖర్చులు తాము భరించలేమన్నారు. ఈ కారణంగానే తాము చికిత్స చేయించుకోకుండా ఇళ్లలోనే ఉంటున్నామని తెలిపారు.
ఇదీ చదవండి :పల్లెలపై కొవిడ్ పడగ.. వేలల్లో సిబ్బంది కొరత