కేరళ అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి మామాఅల్లుళ్లు శాసనసభలో అడుగుపెట్టనున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో.. ఆయన అల్లుడు రియాస్ కలిసి పనిచేయనున్నారు. పినరయి విజయన్ కన్నూర్‌లోని ధర్మదామ్ నియోజకవర్గం నుంచి 50వేలకు పైగా మెజారిటీతో అఖండ విజయం సాధించారు. అదే బాటలో ఆయన అల్లుడు డీవైఎఫ్ఐ అధ్యక్షుడు పీఏ మహమ్మద్ రియాస్ కూడా కోజికోడ్‌లోని బేపోర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2009లోనూ కోజికోడ్ నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు రియాస్. కానీ అప్పుడు ఓడిపోయారు.
2020, జూన్ 15న పినరయి విజయన్ కుమార్తె వీణను.. మహమ్మద్ రియాస్ వివాహమాడారు.
ఇదీ చదవండి :పునరపి విజయం- చరిత్ర సృష్టించిన ఎల్డీఎఫ్!
చేజారిన అదృష్టాలు..
ఏఫ్రిల్ 6న జరిగిన కేరళ ఎన్నికల్లో మరికొంతమంది రాజకీయనేతలు.. తమ కూతుళ్లు, కుమారులు, బంధువులను బరిలోకి దింపారు. కానీ వారికి అదృష్టం కలిసిరాలేదు. కేరళ కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకుడు కే.మణి.. తన చెల్లెలి భర్త ఎం.పీ జోసెఫ్‌ను యూడీఎఫ్ తరఫున బరిలోకి దింపారు. కానీ ఇద్దరూ ఓటమిని చవిచూశారు. కేరళ కాంగ్రెస్ ఛైర్మన్ పీజే జోసఫ్ యూడీఎఫ్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. కానీ ఆయన అల్లుడు డాక్టర్.జోసఫ్ ఓడిపోయారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కే.కరుణాకరణ్ కుమారుడు కే.మురళీధరన్, కుమార్తె పద్మజా వేణుగోపాల్ విజయాన్ని అందుకోలేక పోయారు.
2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ 99 స్థానాల్లో గెలుపొంది రెండోసారి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ సారథ్యంలో యూడీఎఫ్ 41 స్థానాలకే పరిమితమైంది. ఇక కమలంపార్టీ ఈ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయింది.
ఇదీ చదవండి :కేరళ కాంగ్రెస్ (బి) ఛైర్మన్ కన్నుమూత