Woman assaulted in Bihar: బిహార్లోని మాధేపురలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఆమెను వివస్త్రను చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన తాలూకు దృశ్యాలు గురువారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.
ఇదీ జరిగింది...::మాధేపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఓ మహిళ.. బహిర్భూమికి వెళ్లిన సమయంలో కొంతమంది యువకులు ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. మహిళ గట్టిగా అరిచేసరికి స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వీరిని చూసిన యువకులు.. ఓ కల్పిత కథను అల్లారు. ఆ మహిళ వేరే వ్యక్తితో పొలాల్లో కనిపించిందని గ్రామస్థులతో చెప్పారు. తమను చూసి ఆ వ్యక్తి పారిపోయాడని ఆరోపించారు. యువకుల మాటలు విని గ్రామస్థులు ఈ విషయంపై పంచాయితీ నిర్వహించారు.
పంచాయితీకి వచ్చి తన వివరణ తెలియజేయాలని మహిళను గ్రామస్థులు ఆదేశించారు. ఘటనాస్థలి నుంచి పారిపోయిన వ్యక్తి ఎవరో చెప్పాలని స్పష్టం చేశారు. అయితే, ఈ ఆరోపణలను మహిళ ఖండించింది. తనపై యువకులు దాడి చేశారని, లొంగదీసుకోవాలని ప్రయత్నించారని తెలిపింది. ప్రతిఘటిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని యువకులు హెచ్చరించారని పేర్కొంది.
అయితే ఈ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువకులు.. మహిళపై అందరి ముందే దాడి చేశారు. కర్రలతో తీవ్రంగా కొట్టారు. మహిళ వస్త్రాలను లాగేశారు. దెబ్బలకు తాళలేక మహిళ అర్ధనగ్నంగా రోదిస్తూ కింద పడిపోయింది. సమాచారం అందుకొని ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నామని మాధేపుర ఎస్హెచ్ఓ కమ్ ఇన్స్పెక్టర్ సురేంద్ర సింగ్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి:భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై గ్యాంగ్ రేప్.. మహారాష్ట్రలో మైనర్లపై దారుణం..