తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పోలింగ్​ - అసెంబ్లీ పోలింగ్ అప్డేట్స్​

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మినీ సార్వత్రిక సమరంలో కీలక దశ పూర్తయింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరీల్లో మంగళవారం పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అసోంలో 82.33 శాతం, బంగాల్​లో 77.68 శాతం, తమిళనాడులో 71.79 శాతం, కేరళలో 74.02 శాతం, పుదుచ్చేరి 81.64 శాతం పోలింగ్‌ నమోదైంది.

assembly elections
అసెంబ్లీ ఎన్నికలు

By

Published : Apr 7, 2021, 5:30 AM IST

Updated : Apr 7, 2021, 6:31 AM IST

దేశంలో ఓటు చైతన్యం వెల్లివిరిసింది! కరోనా భయపెడుతున్నా ప్రజలు వెనక్కి తగ్గలేదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. రాజ్యాంగం తమకు కల్పించిన ఓటుహక్కును వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మినీ సార్వత్రిక సమరంలో కీలక దశ పరిసమాప్తమైంది. తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో మంగళవారం పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. కొన్నిచోట్ల స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హోరాహోరీ పోరు నడుస్తున్న పశ్చిమ బెంగాల్‌లో మాత్రం పరిస్థితులు ఉద్రిక్తంగా కనిపించాయి. భాజపా, తృణమూల్‌ కార్యకర్తలు పలుచోట్ల పరస్పరం ఘర్షణలకు దిగారు. ఐదుగురు అభ్యర్థులపై దాడులు చోటుచేసుకున్నాయి. వారిలో ఇద్దరు మహిళలు. కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తుండటంతో పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులు తగిన ఏర్పాట్లుచేశారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పోలింగ్​

అట్టుడికిన బంగాల్‌

బంగాల్‌లో మూడో విడత 31 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పలు ప్రాంతాల్లో తృణమూల్‌, భాజపా శ్రేణులు ఘర్షణలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఐదుగురు అభ్యర్థులు తమపై ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు దాడికి తెగబడ్డారని ఆరోపించారు. ఆరాంబాగ్‌ తృణమూల్‌ అభ్యర్థి సుజాతా మోండల్‌.. పోలింగ్‌కేంద్రాలను సందర్శిస్తున్నప్పుడు కమలదళం కార్యకర్తలు తనపై దాడి చేశారని ఆరోపించారు. మోండల్‌ను కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకున్న కొందరు తరమడం, కర్రలతో ఆమె తలపై కొట్టడం వీడియోల్లో కనిపించింది. ఈ వ్యవహారంలో ముగ్గురు తృణమూల్‌ కార్యకర్తలు, ఇద్దరు భాజపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఉలుబెరియా-దక్షిణ అభ్యర్థి, మహిళా నేత పాపియా అధికారి(భాజపా)పైనా దాడి చోటుచేసుకుంది. తృణమూల్‌ శ్రేణులు తనపై దాడి చేశాయని తారకేశ్వర్‌ అభ్యర్థి స్వపన్‌ దాస్‌గుప్తా(భాజపా), భాజపా కార్యకర్తలు తమపై దాడికి తెగబడ్డారని తృణమూల్‌ అభ్యర్థులు నజ్ముల్‌ కరీం, నిర్మల్‌ మజీ విడివిడిగా ఆరోపించారు. కానింగ్‌ పుర్బా సీటు పరిధిలోని ఓ పోలింగ్‌కేంద్రం వెలుపల దుండగులు నాటుబాంబులు విసరగా.. ఓ వ్యక్తి గాయపడ్డారు.

తృణమూల్‌ నేత ఇంట్లో ఈవీఎంలు

బెంగాల్‌లోని హావ్‌డా జిల్లాలో తృణమూల్‌ నేత ఇంట్లో నాలుగు ఈవీఎంలు, వీవీపాట్‌లు ఉండటం కలకలం సృష్టించింది. ఉలుబెరియా(ఉత్తర) నియోజకవర్గం పరిధిలోని తుల్సీబెరియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సెక్టార్‌-17 అధికారి తపన్‌ సర్కార్‌ ఈవీఎంలు, వీవీపాట్‌లతో తృణమూల్‌ నేత ఇంటికి వెళ్లినట్లు తేలింది. తపన్‌ సస్పెండయ్యారు.

కేరళలో ఇద్దరు ఓటర్ల మృత్యువాత

కేరళలోని పథనంథిట్టలోని అరన్ముళలో ఓ ఓటరు, కొట్టాయంలోని చవిట్టువవరీలో మరొకరు ఓటు వేసేందుకు లైన్‌లో వేచిఉండగా కుప్పకూలి మరణించారు. కళకూటమ్‌ నియోజకవర్గంలోని కట్టయికొనమ్‌ వద్ద సీపీఎం, భాజపా శ్రేణులు ఘర్షణపడ్డాయి. నలుగురు భాజపా కార్యకర్తలు గాయపడ్డారు. ముగ్గురు సీపీఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అసోంలో గాల్లోకి కాల్పులు

తాజాగా 40 స్థానాలకు ఎన్నికలు జరగడంతో అసోం అంతటా పోలింగ్‌ పూర్తయింది. గోలక్‌గంజ్‌లోని ఓ పోలింగ్‌కేంద్రం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. గాల్లోకి కాల్పులు జరిపారు.

తమిళనాట ప్రశాంతం

తమిళనాడులో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. కరోనా బాధితులకు సాయంత్రం 6-7 గంటల మధ్య ఓటింగ్‌ అవకాశం కల్పించారు. డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గత ఎన్నికలతో(74.81%) పోలిస్తే తక్కువ ఓట్లు పోలయ్యాయి.

ఎంపీ కారుపై దాడి

తేని జిల్లా బోడిలో ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కుమారుడు, ఎంపీ రవీంద్రనాథ్‌ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి పరారయ్యారు. ఆ సమయంలో రవీంద్రనాథ్‌ కారులో లేరు. రైల్వే లెవల్‌క్రాసింగ్‌ గేటు దగ్గర సబ్‌వే నిర్మించాలన్న తమ డిమాండ్‌ నెరవేరకపోవడంతో రామనాథపురం జిల్లాలోని ఆరు గ్రామల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. టైర్ల పరిశ్రమను తొలగించాలనే డిమాండ్‌ను ఖాతరు చేయడం లేదంటూ రాణిపేట నియోజకవర్గంలోని కత్తారికుప్పం గ్రామ ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మక్కళ్‌ నీది మయ్యం, భాజపాలకు కొన్ని పోలింగ్‌ బూత్‌లలో ఏజెంట్లు కరవయ్యారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్‌ పోటీచేసిన ధారాపురం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి.

ఓటేసిన ప్రముఖులు

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌ చెన్నైలో ఓటు వేశారు. మే 2న శుభవార్త వింటారని విలేకర్లతో మాట్లాడుతూ స్టాలిన్‌ పేర్కొన్నారు. సీఎం పళనిస్వామి ఎడప్పాడిలో ఓటేశారు. ఓటు వేసేటప్పుడు పార్టీ గుర్తును ధరించారంటూ డీఎంకే అభ్యర్థి (చెపాక్‌-ట్రిప్లికేన్‌) ఉధయనిధి స్టాలిన్‌పై ఉన్నతాధికారులకు అన్నాడీఎంకే ఫిర్యాదు చేసింది. కోయంబత్తూరులోని ఓ పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించిన మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్‌.. ఆ కేంద్రం వెలుపల ఓటర్లకు కొందరు డబ్బు, టోకెన్లు పంచుతున్నారని ఆరోపించారు. పుదుచ్చేరిలో పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది.

Last Updated : Apr 7, 2021, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details