Importance of MLA Candidate Affidavit in Telangana Election : ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవడం ఓటర్ల బాధ్యత, హక్కు, విధి. అప్పుడే అభ్యర్థులకు సంబంధించి ఓ స్పష్టత వస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) సైతం ఇదే విషయాన్ని పలుమార్లు స్పష్టంచేసింది. అందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌తోపాటు అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. 1961 ఎన్నికల నిబంధన(Election Rule 1961)లకు లోబడి 'రూల్-4A' కింద నిర్దేశించిన ఫారం-26 రూపంలో అభ్యర్థులు అఫిడవిట్ సమర్పించాలి. అందులో అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలతోపాటు ఆస్తులు, అప్పుల వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. అభ్యర్థితోపాటు కుటుంబసభ్యులకు చెందిన వివరాలూ ఇవ్వాల్సి ఉంటుంది. భర్త లేదా భార్య, వారిపై ఆధారపడిన కుటుంబంలోని సభ్యులు, అవిభాజ్య హిందూ కుటుంబంలో కర్త అయితే అందుకు సంబంధించిన వివరాలు పేర్కొనాలి.
Telangana MLAs Election Affidavit : అన్ని రకాల ఆస్తులు... స్థిర, చర ఆస్తుల వివరాలతోపాటు చేతిలో, బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు, డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర సేవింగ్స్, షేర్లు, బాండ్లు, బీమా, ఇతరులకు ఇచ్చిన అప్పులు, తదితర అన్ని వివరాలు పొందుపర్చాలి. ఆభరణాలు, వాహనాలు, వ్యవసాయ భూములు, వాణిజ్య సముదాయాలు, నివాస స్థలాలు... ఇలా అన్ని రకాల ఆస్తుల వివరాలు అఫిడవిట్ లో తప్పనిసరిగా పేర్కొనాలి. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనాలు, నివాస భవనాలకు సంబంధించిన వివరాలూ పొందుపర్చాలి. అవి వారసత్వంగా వచ్చాయా... లేక కొనుగోలు చేశారా అన్నది తెలపాలి. ఒకవేళ కొనుగోలు చేస్తే అప్పటి ధర, ఆ తర్వాత అభివృద్ధి కోసం దానిపై పెట్టిన పెట్టుబడి, సంబంధిత వివరాలూ కూడా పేర్కొనాలి. స్థిరాస్థులకు సంబంధించిన ప్రస్తుత మార్కెట్ విలువను పొందుపర్చాలి.
How to Register to Vote Telangana : ఓటు హక్కే మీ వజ్రాయుధం.. ఈ హక్కును వదులుకోవద్దు
Telangana Assembly Election 2023 :అభ్యర్థితోపాటు కుటుంబసభ్యుల పేరిట రుణాలు ఉంటే వాటి వివరాలు సైతం అఫిడవిట్‌లో ప్రస్తావించాలి. కుటుంబ సభ్యుల పాన్ ఖాతాల వివరాలు విధిగా పేర్కొనాలి. 2019లో సవరించిన నిబంధనల ప్రకారం ఆదాయ పన్ను రిటర్న్స్‌లో పొందుపర్చిన ఆదాయ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఏడాదివే కాకుండా గడచిన ఐదేళ్ల రిటర్న్స్‌లోని ఆదాయ వివరాలూ పేర్కొనాలి. విదేశాల్లో ఎలాంటి ఆస్తులు ఉన్నాయో..? వాటి నుంచి లబ్ది పొందుతున్న వివరాలు అఫిడవిట్‌లో పొందుపర్చాలి. అభ్యర్థితోపాటు భార్య లేదా భర్త వృత్తి, వారికి వచ్చే ఆదాయ మార్గాలు, ప్రభుత్వం లేదా ప్రైవేట్ కంపెనీల కాంట్రాక్టులు ఉంటే వాటి వివరాలు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నివాసాలు ఉపయోగిస్తే వాటికి సంబంధించిన వివరాలు, నో-డ్యూస్ ధ్రువపత్రాలు జతపర్చాలి. వీటితోపాటు అభ్యర్థుల నేరచరిత్రకు సంబంధించిన వివరాలు అఫిడవిట్‌లో తప్పనిసరిగా పొందుపర్చాలి.