Gold Smuggling News: ఒక్కరోజే దాదాపు 19 కేజీల బంగారం అక్రమ రవాణాను అడ్డుకున్నారు మణిపుర్ అధికారులు. సోమవారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో అధికారులు బిస్కెట్ల రూపంలో తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో కొన్నిటిని స్వాధీనం చేసుకోగా.. స్కూటీలో మరికొన్నింటిని గుర్తించారు అధికారులు. వీటి విలువ మొత్తం దాదాపు రూ.10 కోట్లు ఉంటుంది.
Imphal Gold Seized: చన్డేల్ జిల్లా తమ్నాపోప్కీలో సోమవారం మధ్యాహ్నం ఓ స్కూటీ ద్వారా బంగారం స్మగ్లింగ్ జరుగుతుండగా అధికారులు గుర్తించారు. బిస్కెట్ల రూపంలో తరలిస్తున్న ఈ బంగారం 8.3 కేజీలు ఉంటుందని.. వీటి విలువ రూ.4.44 కోట్లు అని ఇంఫాల్ కస్టమ్స్ యాంటీ స్మగ్లింగ్ యూనిట్ అధికారులు వెల్లడించారు. తమకు అందిన సమాచారం మేరకు మోరేహ్ నుంచి వచ్చే రెడ్ స్కూటీలో తనిఖీలు చేపట్టగా 50 బంగారం బిస్కెట్లు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. స్కూటీలోని ఎయిర్ఫిల్టర్లలో ఈ గోల్డ్ బిస్కెట్లను దాచి నిందితులు స్మగ్లింగ్‌కు యత్నించారని తెలిపారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.